ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీలో నటించిన ఏనుగుల నటన ఆస్కార్ స్థాయి వరకూ వెళ్ళింది. ఈ సినిమాలో ఇద్దరు దంపతులు, ఏనుగులు వీళ్ళే ఉంటారు. ఏనుగులు, మనుషుల మధ్య జరిగే చక్కని కథతో కట్టిపడేస్తారు. అంత అద్భుతంగా ఈ చిత్రంలోని ఏనుగులు, మనుషులు జీవించారు. అందుకే ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే ఇంతటి సక్సెస్ కి కారణమైన ఏనుగులు అదృశ్యమయ్యాయి.
95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా తమిళ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు కనబడుటలేదన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు నటించాయి. ఆ ఏనుగులే ఇప్పుడు అదృశ్యమయ్యాయని ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్ వెల్లడించారు. మద్యం మత్తులో ఉన్న కొంతమంది వ్యక్తులను తరుముకుంటూ అడవిలోకి వెళ్లిపోయాయని అన్నారు.
ప్రస్తుతం బొమ్మన్ ఏనుగుల కోసం క్రిష్ణగిరి అడవుల్లో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు ఏనుగులు విడిపోయి ఉన్నాయా? కలిసే ఉన్నాయన్న విషయంపై తనకు స్పష్టత లేదని అన్నారు. ఈరోజు ఎలాగైనా ఆ ఏనుగుల ఆచూకీ తెలుసుకుంటానని.. ఒకవేళ అవి కనిపించకపోతే మా ఊరు వెళ్లిపోతానని బొమ్మన్ అంటున్నారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీని కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. రెండు అనాథ ఏనుగు పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన బొమ్మన్, బెల్లి అనే దక్షిణాది దంపతుల ప్రయాణమే ఈ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. ఏనుగులకు, మనుషులకు మధ్య ఉండే సంబంధం.. అలానే వారి పనులు కాలక్రమేణా ప్రకృతికి ఎలా దోహదపడ్డాయి అనే అంశాలు ఈ చిత్రంలో ప్రతిబింబిస్తాయి. ఈ లఘుచిత్రానికి ఆస్కార్ రావడం పట్ల బొమ్మన్ చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నారు.
తమ కథను ప్రపంచానికి చూపించినందుకు డైరెక్టర్ కార్తికికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ కథ ఇంతలా పేరు తెస్తుందని ఊహించలేదని అన్నారు. చాలా సాధారణంగానే రోజూ నిజ జీవితంలో ఎలా ప్రవర్తిస్తామో అలానే చిత్రీకరించారని అన్నారు. ప్రస్తుతం బొమ్మన్ కృష్ణ అనే పెద్ద ఏనుగును సంరక్షిస్తున్నారు. ఇక బెల్లి ఏనుగును సంరక్షించే బాధ్యత నుంచి ఏడాది క్రితమే తప్పుకున్నారని.. ఇటీవలే మళ్ళీ సంరక్షణ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే తమకు ఇంత పేరు తీసుకొచ్చిన రెండు ఏనుగులు కనబడకుండా పోవడం మాత్రం చాలా బాధగా ఉందని బొమ్మన్ అన్నారు. మరి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు తిరిగి అతని వద్దకు చేరుకోవాలని కోరుకుందాం.