ఈసారి ఆస్కార్ వేడుకల్లో భారతదేశం సత్తా చాటింది. ఏకంగా రెండు పురస్కారాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆస్కార్ సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత మాత్రం అవార్డు కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశారు.
సినీ ప్రపంచంలో విశిష్ట పురస్కారాలుగా చెప్పుకునే ఆస్కార్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 95వ ఆస్కార్ వేడుకల్లో భారత్ సత్తా చాటింది. ఒక్క అవార్డు వచ్చినా గొప్పే అనుకుంటున్న తరుణంలో ఏకంగా రెండు పురస్కారాలు దక్కడంతో యావత్ దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే భారత డాక్యుమెంటరీకి కూడా పురస్కారం లభించింది. అయితే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాతల్లో ఒకరైన గునీత్ మోంగా ఆస్కార్ నిర్వాహకుల మీద తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టేజీపై తనను అవమానించారని ఆమె వాపోయారు.
‘ఆస్కార్ అవార్డు తీసుకున్నాక నాకు అవమానం జరిగింది. సాధారణంగా ఆస్కార్ అందుకున్న అనంతరం ప్రతి ఒక్కరికీ 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఎవరైనా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే వారి మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ నేను మాట్లాడటం స్టార్ట్ చేయగానే, నా మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారు. దీంతో నేను ఏదైతే విషయం చెప్పాలనుకున్నానో అది చెప్పలేకపోయా. మాట్లాడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది’ అని గునీత్ మోంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేసేసరికి.. ఆస్కార్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు అనిపించిందన్నారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. యావత్ భారత్కు జరిగిన అవమానంగా భావిస్తున్నానని గునీత్ చెప్పారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.