కార్తికేయ-2.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 60 థియేటర్లతో మొదలైన సినిమా బీ టౌన్‌లో ఇప్పుడు వారంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నిఖిల్ కెరీర్‌లో కార్తికేయ 2 సినిమా రిలీజైన వారానికే.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్స్ సమయంలో ఓ అనిశ్చితి అయితే నెలకొంది. దిల్ రాజు థియేటర్లు ఇవ్వనన్నారంటూ వార్తలు రావడం, మా సినిమా రిలీజ్ వాయిదా వేసుకోమన్నారు అంటూ నిఖిల్ ఏడవడం, ఆ తర్వాత దిల్ రాజు స్పందించడం, మీడియాపై నిప్పులు చెరగడం చూశాం. ఈ మొత్తం సినారియో ఇండస్ట్రీలో, అటు సినిమా ప్రేక్షకుల్లో ఉత్కంఠరేపిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండస్ట్రీలో నిర్మాతగా నా సినిమా వస్తుంటే అవతలి వ్యక్తిని.. ఈ వారం నేను రిలీజ్ చేసుకుంటా వచ్చే వారం నువ్వు చేసుకో అని అడుగుతుంటాం. అవతలి వ్యక్తి నువ్వే ఆగచ్చుగా అంటాడు. అవన్నీ సర్వ సాధారణం. దిల్ రాజు లాంటి వ్యక్తి నిఖిల్ సినిమా వాయిదా వేసుకోమన్నాడు అంటే గర్వంగా ఫీల్ అవ్వాలి” అన్నారు.
“కార్తికేయ 2 క్రేజీ ప్రాజెక్ట్.. గ్యారెంటీ హిట్ సినిమా కాబట్టే దిల్ రాజు అలా అడిగుంటాడు. నాగచైతన్య సినిమాకి పోటీగా ఫీల్ అయ్యి నిఖిల్ సినిమా వాయిదా వేసుకోమన్నాడు అంటే ప్రౌడ్ గా ఫీలవ్వాలి. సరే అన్న ఈ వారం నీ సినిమా వేసుకో.. వచ్చే వారం మాకు థియేటర్స్ ఇవ్వు అంటే ఇష్యూనే ఉండేది కాదు. మొన్న దిల్ రాజు మాట్లాడుతుంటే నిఖిల్ సైలెంట్‌గా ఉన్నాడంటే.. అంతా మీరే(మీడియా) క్రియేట్ చేసుండచ్చు(నవ్వుతూ)” అంటూ తమ్మారెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.