షూటింగ్ సెట్లో హీరోలు చిరాకు పడటం, అసిస్టెంట్ డైరెక్టర్లని అప్పుడప్పుడు విసుక్కోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల సీరియల్ సెట్లో హీరో ఓవరాక్షన్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్ తో చెంపదెబ్బ తినడం మాత్రం.. బుల్లితెర ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆ బుల్లితెర హీరోపై ఏకంగా బ్యాన్ విధిస్తూ తెలుగు టీవీ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది.
‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్‌తో చందన్ కుమార్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అతను లీడ్ రోల్ లో ‘శ్రీమతి శ్రీనివాస్’ అనే కొత్త సీరియల్ కూడా ప్రారంభం అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే సోమవారం షూటింగ్ సెట్ లో చందన్ కుమార్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో చాలా దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతని తల్లిని దుర్భాషలాడాడు.
ఇంకా శ్రుతిమించి ప్రవర్తించడంతో అక్కడున్న వారికి కోపం వచ్చి అతనిపై సీరియస్ అయ్యారు. అంతా కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ కు చందన్ కుమార్ క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోగా నేనేంటో చూపిస్తానంటూ చందన్ కుమార్ సవాళ్లు విసరాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడున్న వారంతా వాళ్లని విడదీసి చందన్ కుమార్ ను అక్కడి నుంచి పంపేశారు.
అయితే ఆ వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ, చందన్ కుమార్ ఈ వ్యవహారాన్ని కన్నడ ఇండస్ట్రీ దాకా తీసుకెళ్లాడు. అక్కడ తెలుగు ఇండస్ట్రీ గురించి తప్పుడు ప్రచారాలు చేశాడు. చందన్ కుమార్ వ్యవహారంపై బుధవారం తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం అయ్యింది. బాధితుడు కూడా జరిగింది ఏంటో అంతా వివరించాడు. సెట్లో దురుసుగా ప్రవర్తించడం, తెలుగు ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడినందుకు చందన్ కుమార్ పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చందన్ కుమార్‌పై బ్యాన్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.