కొత్త సంవత్సరం మొదలై మూడు రోజులు కూడా గడవకముందే ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిట్టు పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. మూర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, పెద్దాడ మూర్తి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. హైదరాబాద్, రాజీవ్ నరగ్‌లోని శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కాగా, మూర్తి విశాఖపట్నంలోని భీముని పట్నంలో జన్మించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాహిత్యం వైపు వచ్చారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే జర్నలిజం వైపు వచ్చారు. పలు పత్రికల్లో పని చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దృష్టిలో పడ్డారు. మూర్తిలోని కలను గుర్తించిన తమ్మారెడ్డి ‘కూతురు’ సినిమాలో ఓ పాటను రాయించారు. తర్వాత పలు సీరియళ్లకు కూడా మూర్తి పాటలు రాశారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ సినిమాలో ‘‘బుగ్గే బంగారమా?’’తో మంచి గుర్తింపు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ‘సిగ్గుతో ఛీ ఛీ’’ పాటకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందారు. ఆయన మాటలతో పాటు పాటలు అందించిన ‘నాగలి’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిపోయింది. గత సంవత్సరం మూర్తి సోదరుడు ప్రకాశ్ మరణించారు. ప్రకాశ్ కూడా పలు సినిమాలకు పాటలు రాశారు. ప్రకాశ్, మూర్తిల మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి, పాటల రచయిత పెద్దాడ మూర్తి మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.