డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయం పొందింది. మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. లైగర్ టీమ్ ప్రమోషన్లలతో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అయితే అంచనాలకు తలకిందులు చేస్తూ లైగర్ ఊహించని పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ కి డిస్ట్రి బ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ కొందరికి వార్నింగ్ ఇస్తున్నట్లు ఓ ఆడియో విడుదల చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
విజయ్, అనన్యాపాండే హీరో, హీరోయిన్లు పూరీ జగన్నాథ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ లైగర్ నెగిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బొల్తాపడింది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలతో పెద్ద మొత్తానికి సినిమాను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్డిబిటర్లకు భారీగా నష్టాలు వచ్చాయని టాక్. ఈ నేపథ్యంలో వారికి, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మధ్య వివాదం జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. వీటిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చట్ట ప్రకారం చూస్తే.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరీకి లేదని ఆయన అన్నారు.
ఇక తమ్మారెడ్డి మాట్లాడుతూ…”పూరీ జగన్నాథ్ రవితేజతో తెరకెక్కించిన నేనింతే సినిమా విడుదలైనప్పుడు కూడా ఎగ్జిబిట్లరు, డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ధర్నాకు దిగారు. అయితే కొన్నిరోజుల తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇక లైగర్ విషయానికి వస్తే.. పూరీ మాట్లాడిన మాటల్లో ధర్మం ఉంది. అయన ఎవరి వద్దకు వెళ్లి సినిమాను కొనుగోలు చేయాలని అడగలేదు. కొనుగోలు దారులే విజయ్ దేవరకొండ నటించిన గత సినిమాలు ఎంత వసూలు చేశాయో అంచనా వేసుకుని లైగర్ ను కొనుగోలు చేయాలి. అయితే ఎక్కువ రేటుకు లైగర్ సినిమాను కొనుగోలు చేసి వాళ్లు తప్పు చేశారు.
న్యాయంగా మాట్లాడుకుంటే.. పూరీ ఒక సినిమాతో మార్కెట్ లోకి వచ్చాడు. తనకు నచ్చిన ఓ ధరను చెప్పి.. ఆ సినిమాను అదే ధరకు అమ్ముతానని అన్నాడు. ఆయన చెప్పిన రేటు ఇష్టం లేకుంటే కొనుగోలు చేయకుండా ఉండాల్సింది. ఆ ధరకు ఇష్టపడే కొనుగోలు చేసి.. ఇప్పుడు మేము నష్టపోయాం తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడం ఎందుకు? అంత మొత్తంలో సినిమాను కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి” అని తమ్మారెడ్డి అన్నారు.