సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ నిర్మాత మరణించారనే వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను మంగళవారం (జూలై 11) రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. రాజ్ కన్ను.. అమ్మన్ క్రియేషన్స్ బ్యానర్ మీద పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రజల మనుసుల్లో నిలిచిపోయే సందేశాత్మక చిత్రాలు తీసి, పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
కమల్ హాసన్, రజినీ కాంత్, శ్రీదేవిలతో ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించడంతో పాటు, ఆ మూవీతో భారతీ రాజాను దర్శకుడిగా పరిచయం చేశారు. అలాగే ‘కిళక్కు పోగుం రైయిల్’ (తూర్పు వెళ్లే రైలు) తో రాధికను ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది. కె.భాగ్య రాజ్ ప్రతినాయకుడిగా నటించిన ‘కన్నె పరువత్తిలే’, కార్తీక్ – రాధ జంటగా భారతీ రాజా డైరెక్ట్ చేసిన ‘వాలిభమే వావా’, పాండియన్ – రేవతి నటించిన ‘పొన్ను పుడిచ్చిరిక్కు’, కె.భాగ్య రాజ్ దర్శకత్వం వహించిన ‘ఎంగ చిన్న రాసా’ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాజ్ కన్ను మరణ వార్తతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కమల్ హాసన్, రాధిక, భారతీ రాజా సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. రాజ్ కన్ను భౌతికకాయానికి బుధవారం మధ్యాహ్నం చెన్నై క్రోంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.