ప్రస్తుత కాలంలో భూముల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. పోను పోను.. ధర పెరుగుతుంది తప్ప.. తగ్గదు అనే ఉద్దేశంతో చాలా మంది భవిష్యత్తు అవసరాల నిమిత్తం భూమి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నవారు.. భూమి మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. పాతతరం వారిని ఎవరిని కదిలించినా సరే.. తమ కెరీర్‌లో సాధించిన డబ్బుతో ఎక్కువగా భూములు కొన్నామనే చెబుతారు. నాడు వందలు, వేలు ఖర్చు చేసి కొన్న భూములు నేడు.. కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. ఇక రియల్‌ఎస్టెట్ పెరగడం.. ల్యాండ్ ధరలకు రెక్కలు రావడంతో.. కబ్జారాయుళ్లు కూడా పెరిగిపోతున్నారు. చాలా ఏళ్ల పాటు పట్టించుకోకుండా వదిలేసిన భూములకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి.. కోట్లు గడిస్తున్నారు.
సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ఇలా కబ్జారాయుళ్ల చేతిలో బలవుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ వాణిశ్రీకి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అమెకు చెందిన 20 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం కబ్జాకు గురయ్యింది. దీనిపై అధికారులను ఆశ్రయించగా.. సీఎం స్టాలిన్ ప్రత్యేక చొరవ తీసుకుని.. ల్యాండ్‌ను వాణిశ్రీకి అప్పగించారు. ‘‘11 ఏళ్ల క్రితం స్థలం కబ్జాకు గురవ్వగా.. స్టాలిన్ ప్రభుత్వం చొరవ వల్ల నాకు నా స్థలం తిరిగి దక్కింది. స్టాలిన్ నిండూనూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ.. ప్రజలకు సేవ చేయాలని’’ ఈ సందర్భంగా వాణిశ్రీ ఆశీర్వదించారు.
కబ్జారాయుళ్లు కొందరు నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా వాణిశ్రీకి చెందిన స్థలాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని.. దాన్ని వేరే వాళ్లకి విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం కాస్త వాణిశ్రీ దృష్టికి రావడంతో.. ఆమె జరిగిన మోసం గురించి అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో భూకబ్జాలకు సంబంధించి 2021, సెప్టెంబర్‌లో తమిళనాడు శాసనసభ నూతన చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం.. నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా అక్రమంగా వేరే వారికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే.. దాన్ని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం వాణిశ్రీకి చెందిన 20 కోట్ల విలువైన రూపాయల స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించి.. ఆ పత్రాలను స్వయంగా సీఎం స్టాలిన్.. ఆమెకు అందించారు.