కోలివుడ్ హీరో సూర్యకు.. టాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ ఉంది. తెలుగు హీరోలతో సమానంగా ఆయనకు ఇక్కడ ఆదరణ కనిపిస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే.. కోలీవుడ్‌లో ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారో.. ఇక్కడి ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అంతే కాదు.. కోలీవుడ్‌లో ఆయన సినిమాలు చేసే వసూళ్లకు ధీటుగా ఇక్కడా కలెక్షన్లు వస్తుంటాయి. అలాంటప్పుడు సూర్య తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేయొచ్చుగా అన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే త్వరలోనే అది నిజం కానుంది.
సూర్య తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడని, దానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని చాలా రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలో త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఖాయమని అంతా అనుకున్నారు. అయితే.., తాజాగా త్రివిక్రమ్ సైతం సూర్య కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్, సూర్య కాంబినేషన్ గురించిన చర్చ గతంలోనే సాగింది. సూర్యకూడా చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. త్రివిక్రమ్ తో చేయాలని వుంది.. కథ కుదిరితే తప్పకుండా చేస్తా` అని చెప్పాడు కూడా. కానీ అప్పట్లో టాలీవుడ్ లోని టాప్ హీరోలంతా త్రివిక్రమ్ వెంట పడడంతో అది కుదర్లేదు. ఇప్పుడు అందుకు మార్గం సుగమం అయ్యిందని తెలుస్తోంది.
సూర్యకు సరిగ్గా సరిపోయేలా త్రివిక్రమ్ ఓ కథ సిద్ధం చేశాడట. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తరవాతి సినిమా సూర్యతోనే అని తెలుస్తోంది. అటు బోయపాటి, ఇటు త్రివిక్రమ్.. వీరిద్దరూ సూర్యతో సినిమాలు చేయడం దాదాపుగా ఖాయం. అయితే.. ఎవరిది ముందు? ఎవరిది తరవాత? అనే విషయంలోనే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఇలా స్టార్ డైరెక్టర్స్ ఇద్దరూ ఒక పెద్ద హీరో కోసం నువ్వా, నేనా అంటూ పోటీ పడుతుండటం ప్రేక్షకులని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ కోల్డ్ వార్ లో విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.