ఆయన అడుగు ఓ అగ్గిపిడుగు..! ఆయన నటజీవితం.. ఓ అలుపెరుగని పోరాటం..!
వెండితెరపై దశాబ్దాలపాటు స్టార్డమ్ ని కొనసాగించిన ఏకైక స్టార్.. నటశేఖరుడిగా.. ప్రయోగాత్మక చిత్రాలకు నాందిగా ముందడుగు వేసి.. తెలుగు సినీ చరిత్రలో కొత్త పుటలను లిఖించిన ఘనత ఆయనది. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. కోట్లాది తెలుగు అభిమానులకు కన్నుల పండుగ చేసుకుంటారు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్.. ఫ్యాన్స్ విజిల్స్ కి ప్రధాన కారకం. ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేనన్నీ ప్రయోగాలు.. మొండితనంతో గుండె ధైర్యంతో ముందుకు సాగిన ఆ తెగింపు.. ఆయన ఒక్కడికే సాధ్యం.. సొంతం.
సూపర్ స్టార్ అంటే ఓ పట్టుదల! సూపర్ స్టార్ అంటే గుండెబలం! సూపర్ స్టార్ అంటే ఓ అలుపెరుగని పోరాటం!
అది భారతదేశం స్వాతంత్య్రం పొందడానికి ఐదేళ్ల ముందు.. అంటే 1942.. అప్పటికింకా ఇండియాలో ఫ్రీడమ్ కోసం పోరాటం తీవ్రస్థాయిలో జరుగుతోంది. అప్పుడీ ఈ చిత్రపరిశ్రమకు తెలీదు. ఓ ముక్కుసూటితనం, మంచితనం కలగలిపిన స్టార్ పుట్టబోతున్నాడని.. ఆ స్టార్ తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తెలుగు సినిమా స్థాయిని, క్రేజ్ ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తాడని ఎవరూ ఊహించలేదు. 1942 మే 23న గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతంలోని బుర్రిపాలెం అనే ఊరిలో జన్మించాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి.
చిత్రపరిశ్రమలో నటుడిగా.. ఓ నిర్మాతగా.. డాషింగ్ డైరెక్టర్ గా సూపర్ స్టార్ కృష్ణ.. దాదాపు 350 చిత్రాలకుపైగా చేశారు. 1965లో తేనె మనసులు సినిమాతో కెరీర్ ప్రారంభించిన కృష్ణ.. తెలుగులో తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి స్పై సినిమాలను ఆయనే పరిచయం చేశారు. ఇండస్ట్రీకి ప్రయోగాత్మక చిత్రాలు అందించాలని ఎల్లప్పుడూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగి.. ఐదు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలారు. అలాగే ఇండస్ట్రీకి తొలి 70ఎమ్ఎమ్.. తొలి ఈస్టమన్ కలర్ సినిమా.. తొలి స్కోప్ సినిమా.. తొలి డిటిఎస్ సినిమాలను అందించి ఎనలేని సేవ చేశారు.
టాలీవుడ్ పుట్టి ఇన్నేళ్లయినా కృష్ణ రికార్డులను ఎవరూ తిరిగిరాయలేకపోయారు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరో సూపర్ స్టార్ ఒక్కరే. 1972లో కృష్ణ నుండి 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతకుముందు 1971లో 11 సినిమాలు.. 1970లో 16 సినిమాలు చేసి సాహో కృష్ణ అనిపించుకున్నారు. ఇండస్ట్రీలోకి అన్నగారు ఎన్టీఆర్ అభిమానిగా అడుగుపెట్టారు కృష్ణ. తన సినిమాలతో, ముక్కుసూటితనంతో ఎన్టీఆర్ నే ధిక్కరించిన గుండెబలం ఆయనది. ఈయన చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఇండస్ట్రీలో ఓ ప్రభంజనం.. ఎన్టీఆర్ కి పోటీగా ఆ సినిమా చేసి.. ఎన్టీఆర్ నే మెప్పించి నిలిచారు.
ఒకటేమిటి కృష్ణ చేసిన ప్రయోగాలు.. తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఇంకా కదలాడుతున్నాయి. మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం, ఆవే కళ్ళు, ఈనాడు.. ఇలా ఎన్నో సినిమాలు ఇండస్ట్రీని ఊపు ఊపేశాయి. ఇప్పటికీ సింహాసనం సినిమా అంటే.. ఆ కాలపు బాహుబలిగా చెబుతుంటారు. సినిమా రంగంలోనే కాదు.. రాజకీయంగా కూడా కృష్ణ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలాగే రంగ హత్య విషయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ఏకంగా సినిమానే చేశారు. ఇండస్ట్రీకి, సినీ నిర్మాతలు, కార్మికులకు ఎన్నో సేవలు చేసిన కృష్ణ.. నిర్మాతల హీరోగా ఎన్నో కోట్ల రెమ్యూనరేషన్స్ వదులుకున్నారు.
కృష్ణ వ్యక్తిగత జీవితంలో మచ్చలేని మనిషి. 1961లో ఇందిరా దేవిని పెళ్లాడిన కృష్ణ.. ఆ తర్వాత 1969లో నటి, దర్శకురాలు విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈయనకు మొత్తం ఐదుగురు సంతానం. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు.. ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. వీరిలో రమేష్ బాబు నటుడిగా, ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. రెండో కుమారుడు మహేష్ బాబు గురించి చెప్పక్కర్లేదు. తండ్రి సూపర్ స్టార్డమ్ ని కంటిన్యూ చేస్తూ.. స్టార్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కృష్ణ వయసు 80 సంవత్సరాలు. వయసు మీదపడటంతో కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. దీంతో ఆయన తనయుడు మహేష్ బాబు.. ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసిన కృష్ణ, మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమాన హీరో.. సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పిస్తున్నారు. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లకుండా.. ఎవ్వరినీ కామెంట్ చేయకుండా నిలిచిన డైనమిక్ స్టార్.. ఇకలేరనే వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.