ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణకు కాంటినెంటల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ గురు.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ గుండెపోటుతో స్పృహలో లేని స్థితిలో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆసుపత్రికి తీసుకురాగానే ఆయనకు ఎమర్జెన్సీ విభాగంలో వైద్యం అందించాం. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశాం. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నాం. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పాలి. ఇప్పటినుంచి ప్రతి గంటా కూడా కీలకమే. 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం’’ అని అన్నారు. కాగా, తెలుగు చిత్ర సీమలో కృష్ణ సూపర్ స్టార్‌గా తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో.. కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాల్లో హీరోగా నటించటంలోనూ రికార్డులను నెలకొల్పారు.
ఒకే ఏడాది అత్యధిక సినిమాల్లో నటించి, విడుదల చేశారు. 70-80లలో ఒక సంవత్సరం 10కిపైగా సినిమాలు విడుదల చేసేవారు. నిర్మాతగా కూడా ఎన్నో హిట్టులతో పాటు బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించారు. వయసు పైబడటంతో గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో ఆయన సతీమణి విజయ నిర్మల మరణంతో తీవ్రంగా కృంగిపోయారు. ఆ బాధనుంచి కోలుకోకముందే మొదటి భార్య ఇందిరా దేవి కూడా ఆయన్ని విడిచి వెళ్లిపోయారు. 2022 సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఇందిరా దేవి మరణం తర్వాతినుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.
కృష్ణకు కార్డియాక్ అరెస్ట్.. 24గంటల తర్వాత ఆరోగ్యంపై ప్రకటన చేస్తాం – కాంటినెంటల్ ఎండీ గురు.ఎన్.రెడ్డి
FULL VIDEO – https://t.co/N8w4ORGlDJ#SuperStarKrishna #Krishna #Tollywood #cardiacarrest #MaheshBabu #Superstar #NTVTelugu pic.twitter.com/gTyTwil6La
— NTV Telugu (@NtvTeluguLive) November 14, 2022