సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్స్ ఈమధ్య ఎక్కువవుతున్నాయి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు రావడం పెరుగుతోంది. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి సీరియస్ అయ్యారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి గురించి అందరికీ తెలిసిందే. హిందీతో పాటు పలు కన్నడ, తెలుగు చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించారాయన. ఇక, ఆయన కూతురు అతియాశెట్టి కూడా చాలా పాపులర్. సినిమాల్లో నటన పరంగా ఆమెకు అంతగా క్రేజ్ రాకపోయినా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి అవడంతో ఆమె అందరికీ సుపరిచితురాలు అయ్యారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా వినియోగంపై సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ఉందని.. అక్కడ విమర్శలకు హద్దే లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో తనపై ట్రోల్స్ వచ్చాయని.. కానీ వాటిని తాను పట్టించుకోలేదన్నారు.
తన కూతురు, తల్లి మీద ఒక వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేయడం మాత్రం ఎంతగానో బాధించిందన్నారు సునీల్ శెట్టి. ‘ది రణ్వీర్ షో’కు గెస్ట్‌గా హాజరైన ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల వల్ల మాకు ప్రైవసీ లేకుండా పోతోంది. దీని వల్ల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరైనా ఏదో ఒక విషయం మీద మాట్లాడితే కొందరు దాన్ని వేర్వేరు అర్థాలతో ఎడిట్ చేస్తున్నారు. తమకు తోచినట్లు రాస్తున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఏం మాట్లాడాలన్నా నాకు భయమేస్తోంది’ అని సునీల్ శెట్టి వాపోయారు. ఇకపోతే, తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన ‘మోసగాళ్లు’ చిత్రంతో పాటు వరుణ్ తేజ్ మూవీ ‘గని’లో కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు సునీల్ శెట్టి.