Jayamma Panchayathi: శుక్రవారం ఏకంగా నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’, ‘‘జయమ్మ పంచాయతీ’’, ‘‘భలాతందనాన’’, ‘‘మా ఇష్టం’’ సినిమాలు థియేటర్లలో మెరిశాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఒకే రోజు నాలుగు చిన్న సినిమాలు రిలీజవ్వటం ఇదే తొలిసారి. ఈ నాలుగు సినిమాల్లో.. మూడు రోజుల ముందు వరకు జయమ్మ పంచాయతీ ట్రెండింగ్‌లో ఉండింది. తానే స్వయంగా లీడ్ పాత్రలో నటిస్తుండటంతో యాంకర్ సుమ తన దైన శైలి ప్రమోషన్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేయటం మొదలుపెట్టారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా ఇంటర్వ్యూల సందర్భంగా కూడా ‘‘జయమ్మ పంచాయతీ’’కి ప్రమోషన్ జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
ఏకథాటి ప్రమోషన్ల కారణంగా సగటు ప్రేక్షకుడి మెదడులో ఈ సినిమా గురించిన ఆలోచన మొదలైంది. అయితే, విశ్వక్ సేన్, దేవీ నాగవల్లిల వివాదంతో ‘‘ జయమ్మ పంచాయతీ’’కి తీరని నష్టం జరిగిందనే చెప్పొచ్చు. మీడియా డిబేట్‌లో ఈ ఇద్దరి మధ్యా జరిగిన గొడవ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నెటిజన్లు విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల కారణంగా ముందంజలో ఉన్న ‘‘జయమ్మ పంచాయతీ’’ కాస్తా వెనుక బడిపోయింది. విశ్వక్ సేన్- దేవీ పంచాయితీ కారణంగా ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ తెరపైకి వచ్చింది. కోట్లు పెట్టినా రాని ప్రమోషన్ ఈ సినిమాకు వచ్చింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
ఇన్ని రోజులు సుమ పడ్డ కష్టం కాస్తా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. గురువారం స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నల గడ్డ, మంచు విష్ణు వంటి వారు సినిమా బాగుందంటూ ట్వీట్లు చేయటం మరింత ప్లస్ అయింది. శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలైన తర్వాత కూడా అందరూ ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. బాగుందన్న టాక్ రావటంతో సినిమాకు మరింత బూస్ట్ వచ్చింది. ఇక, ‘‘జయమ్మ పంచాయతీ’’ గురించి ఎలాంటి టాక్ బయటకు రాకపోవటం మైనస్‌గా మారింది. రెండూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు కావటంతో ఎక్కువ మంది యూత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Vishwak Sen Vs Devi Nagavalli: విశ్వక్-దేవిల వివాదం.. మెంటల్ హెల్త్ యాక్ట్ ఏం…