సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ అనే పదానికి కెరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది సుమ. వేదిక ఏదైనా.. సందర్భంగా ఏదైనా సరే.. తనదైన మాటల ప్రవాహంతో.. కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తోంది. చక్కని రూపం మాత్రమే కాక భాషపై అద్భుతమైన పట్టు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. ఏళ్ల తరబడి యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తోంది సుమ. తొలుత బుల్లితెర నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ.. ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ వైపు మళ్లింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం ప్రీ రిలేజ్ ఈవెంట్స్, బుల్లి తెర కార్యక్రమాలు, సినిమాల విడుదలకు ముందు ప్రత్యేక ఇంటర్వ్యూలు వంటివి చేస్తూ.. టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది సుమ. ఈ క్రమంలో.. గత కొన్ని రోజులుగా సుమకు సంబంధించి ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. అది ఏంటంటే.. సుమ యాంకరింగ్‌కు బ్రేక్ ఇవ్వబోతుంది అని. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది సుమ.
డిసెంబర్ 31 సందర్భంగా ఈటీవీలో ప్రసారం కాబోయే ఓ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. దీనిలో సుమ.. తాను ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా రాణిస్తున్నానని.. అందుకే కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్తూ ఎమోషనల్ అయ్యింది. దాంతో.. సుమ యాంకరింగ్ మానేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కాస్త వైరల్ కావడంతో.. సుమ స్నేహితులు, సన్నిహితులు ఆమెకు కాల్ చేసి.. దీని గురించి ఆరా తీయడం ప్రారంభించారట. దాంతో ఈ వార్తలపై సుమ స్వయంగా స్పందించింది. తాను యాంకరింగ్ మానేస్తున్నాను అంటూ మీడియాలో వస్తోన్న వార్తలను ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది సుమ.
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ చేశాం. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశాం. అది ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అయితే, మొత్తం ఈవెంట్ అంతా చూస్తే.. అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు కంగారు పడకండి. ఇప్పటికే నాకు చాలా మంది.. ఏంటి యాంకరింగ్ మానేస్తున్నావా అంటూ ఫోన్లు చేయడం.. మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారు. వారందరికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే.. నేను టీవీ కోసమే పుట్టాను.. నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను.. నేను ఎటూ వెళ్లడం లేదు. కాబట్టి, మీరు కంగారు పడకుండా.. హాయిగా.. హ్యాపీగా ఉండండి.. మీ అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్’’ అంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేసింది. దాంతో సుమ యాంకరింగ్ మానేస్తుందనే వార్తలకు శుభం కార్డు పడింది.