సుకుమార్ ఇంటిలిజెంట్ డైరెక్టర్ అని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. ఇండస్ట్రీ ఏంటి.. బయట జనం కూడా అదే అంటారు. రాజమౌళి సైతం సుకుమార్ బ్రిలియంట్ డైరెక్టర్ అని కొనియాడారు. సుకుమార్ లెక్కల మాష్టారు కావడంతో ఆయన సినిమాలకి కూడా ఒక లెక్క ఉంటుంది. లెక్కలు అంటే ఇష్టపడే జూనియర్ రామానుజన్ లు ఎంతమంది ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది లెక్కల్ని అయిష్టపడేవారు ఉన్నారు. దీనికి కారణం ఆ బుర్రలకి లెక్కలు అర్థం కాకపోవడం. సుకుమార్ సినిమాలు కూడా అంతే. అంత గమ్మున అర్థం కావు. అర్థం చేసుకుంటే దానంత ఈజీ సబ్జెక్ట్ మరొకటి ఉండదు. సుకుమార్ కూడా వన్ నేనొక్కడినే సినిమా తర్వాత అందరికీ అర్థమయ్యేలా లెక్కలు చెప్పాలనుకున్నారు. అందుకే వన్ నేనొక్కడినే సినిమా ఫెయిల్యూర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
వన్ నేనొక్కడినే సినిమా అనేది అర్థం కానోళ్ళకి ఒక టఫ్ చాప్టర్. కానీ జీనియస్ లకి మాత్రం అదొక గొప్ప చాప్టర్. వన్ నేనొక్కడినే సినిమా చాలా మందికి అర్థం కాలేదు. హాలీవుడ్ సినిమాల అభిరుచి ఉన్న క్లాస్ ఆడియన్స్ కి తప్పితే.. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఎక్కలేదు. దీంతో ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా అభివర్ణించారు. ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇక్కడ ఆడలేదు గానీ విదేశాల్లో మాత్రం బాగా ఆడింది. ముఖ్యంగా యూఎస్ లో అయితే ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ తెలుగు ఆడియన్స్ ని సంతృప్తి చేయలేకపోయానని సుకుమార్ అప్పట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత సినిమాల విషయంలో తన పంథా మార్చుకున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తన లెక్కని మాస్ ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా వివరంగా చెప్పారు. అందుకే ఆ సినిమా బాగా ఆడింది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. అప్పట్లో సుకుమార్ వన్ నేనొక్కడినే ప్రమోషన్ లో భాగంగా ఓ లైవ్ లో పాల్గొన్నారు కదా. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ లైవ్ లో అమెరికాలో ఉండే ఎన్నారై కాల్ చేసి.. సుకుమార్ తో మాట్లాడారు. రివేంజ్ సినిమాకి సైకలాజికల్ ప్రాబ్లమ్ పెట్టడం మైనస్ అని, కథలో లోపాలు ఉన్నాయని, స్టోరీలో దమ్ము లేనప్పుడు లండన్ లో తీసినా, దుబాయ్ లో తీసినా, అమెరికాలో తీసినా జనాలు చూడరని, నాకైతే తలనొప్పిలా అనిపించిందని సదరు కాలర్ అన్నారు.
దీంతో సుకుమార్ కాలర్ పై సీరియస్ అయ్యారు. మీరు తలనొప్పిగా అనిపించి, ఇంత టైం కేటాయించి మాట్లాడుతున్నారంటే మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండి ఉండవచ్చునని సుకుమార్ సీరియస్ అయ్యారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, మీ సొంత అభిప్రాయాన్ని అందరికీ ఆపాదించకండి, ఒకసారి మీరు బయట వ్యక్తుల రెస్పాన్స్ చూసి మాట్లాడండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత సుకుమార్.. సదరు కాలర్ కి లైవ్ లోనే క్షమాపణలు చెప్పారు కూడా. 2014లో తొలగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వన్ నేనొక్కడినే సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి? ఒక ఎన్నారై సుకుమార్ ని లైవ్ లో ఇలా అనడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.