ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయి తుది శ్వాస విడిచారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు.
కాగా, శ్రీనివాస మూర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ప్రముఖ నటుడు సూర్య స్పందిస్తూ.. శ్రీనివాస మూర్తి మరణం వ్యక్తిగత నష్టంగా ఆయన పేర్కొన్నారు. ఆయన గొంతు తెలుగులో తన పాత్రలకు ప్రాణం పోసిందన్నారు. ఇక, సూర్య నటించిన సింగం, సింగమ్ 2, సింగం 3, రాక్షసుడు, 24, వీడొక్కడే, ఆరు, నువ్వు నేను ప్రేమ తదితర సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందిస్తూ.. ‘‘మీ ఆత్మకు శాంతి కలగాలి. మీ గొంతు నన్ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యేలా చేసింది. సినిమా విషయంలో మీ వంతను నేను మిస్సవుతాను’’ అని పేర్కొన్నారు.
ఇక, హృతిక్ నటించిన క్రిష్, క్రిష్ 3, కాబిల్, బ్యాంగ్‌బ్యాంగ్, ధూమ్ 2 సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. 1998లో వచ్చిన శివయ్య సినిమాలో రాజశేఖర్‌కు డబ్బింగ్ చెప్పి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. తన జీవిత కాలంలో దాదాపు 2 వేలకు పైగా సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ స్టార్ హీరోలందరికీ తన గొంతను తెలుగులో అరువిచ్చారు. మరి, శ్రీనివాస మూర్తి మృతిపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.