తమిళంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి విజయాలను సాధించాయి. కొన్ని మాత్రం హిట్టే కాదు ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలా డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కోలీవుడ్ మూవీస్‌లో ఒకటిగా ‘బిచ్చగాడు’ను చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సినిమా బాగుంటే చాలు, అది ఏ భాషకు చెందినదనేది పట్టించుకోరు తెలుగు ప్రేక్షకులు. మంచి కంటెంట్‌తో వచ్చే పరభాషా చిత్రాలను కూడా బ్లాక్ బస్టర్ చేస్తుంటారు టాలీవుడ్ ఆడియెన్స్. అందుకే డబ్బింగ్ సినిమాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు పెద్ద మార్కెట్‌గా మారాయి. తమిళ, కన్నడ సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీస్‌కు మన దగ్గర మంచి డిమాండ్ ఉంది. వాటి డబ్బింగ్ రైట్స్‌ను రూ.కోట్లు పెట్టి కొంటున్నారు. అందులోనూ కొందరు కోలీవుడ్ హీరోలకు తమిళనాడు తర్వాత అతిపెద్ద మార్కెట్ తెలుగు రాష్ట్రాలే కావడం గమనార్హం. సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్, విక్రమ్, అజిత్ సినిమాలకు తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది.
తెలుగులో మంచి గుర్తింపు ఉన్న తమిళ హీరోల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. ఆయన కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు ఇక్కడ అనువాదమై సక్సెస్ సాధించాయి. అందులో 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తల్లి సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ తెలుగు నాట డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి ‘బిచ్చగాడు’ సినిమాను టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ చేయాల్సిందట. ఈ మూవీ చేసే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యిందన్నారు. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ‘బిచ్చగాడు’ తెలుగు వెర్షన్లో నటించాలని ఆయన అనుకున్నారట. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘మహాత్మ’లో శ్రీకాంత్ హీరోగా నటించిన విషయం విదితమే.
ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ సమయంలో శ్రీకాంత్‌తో విజయ్ ఆంటోనీకి పరిచయం ఏర్పడిందట. ఇద్దరి మధ్య మైత్రి కుదరడంతో ‘బిచ్చగాడు’ను తెలుగులో రీమేక్ చేద్దామని శ్రీకాంత్ భావించారట. ఇదే విషయమై నిర్మాత చదలవాడ తిరుపతిరావునూ కలిశారట. అయితే బడ్జెట్ లెక్కలు చూశాక నిర్మాత ధైర్యం చేయలేకపోయారట. దీంతో ‘బిచ్చగాడు’ రీమేక్ ఆరంభ దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న శ్రీకాంత్ గనుక ‘బిచ్చగాడు’ రీమేక్ చేసుంటే ఆయన కెరీర్ మలుపుతిరిగేదని కొందరు అంటున్నారు. రీమేక్ ఆలోచన విరమించుకోవడంతో అదే నిర్మాత ‘బిచ్చగాడు’ను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి, కోట్లు గడించారు. కాగా, త్వరలోనే ‘బిచ్చగాడు’ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అది ఇంకెంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.