శ్రావణ భార్గవి రావూరి.. తెలుగు సినీ, సంగీత ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ భార్గవి ఒక సింగర్ మాత్రమే కాదు.. గీత రచయిత్రి కూడా. 2009 నుంచి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతోంది. ఆమె ఇటీవల అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.
‘ఒకపరి కొకపరి వయ్యారమయ్యే’ అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియోతో.. శ్రావణ భార్గవి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అన్నమయ్య వారసులు ఆ వీడియో తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి అభిషేకంలో ఆలపించే కీర్తనను శ్రావణ భార్గవి అలా చూపించడం సరికాదంటూ వాదిస్తున్నారు. కూర్చొని ఆలపిస్తున్నట్లు వీడియో రూపొందించకుండా.. అమ్మాయి పడుకుని పుస్తకం చదువుతూ ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు.
ఆ వీడియోకి సంబంధించి అన్నమయ్య వారసులు సింగర్ శ్రావణ భార్గవితో ఫోన్లో మాట్లాడారు. “అన్నమయ్య కీర్తన వీడియో చేశారు. అందులో మీరు పడుకుని కన్యాశుల్కం పుస్తకం చదువుతూ ఉన్నారు. స్వామి వారికి అభిషేకంలో పాడే కీర్తనను మీరు అలా తీయడం సరికాదు. దానిని డిలీట్ చేసే మార్గం ఏమైనా ఉంటే చూడండి.” అంటూ అన్నమయ్య వారసులు ఫోన్లో శ్రావణ భార్గవికి విజ్ఞప్తి చేశారు.
అయితే వారి శ్రావణ భార్గవి తోసిపుచ్చారు. “ఆ వీడియోలో తప్పుగా ఏమీ చూపించలేదు. నాకున్న సంగీత జ్ఞానంతో, భక్తి శ్రద్ధలతో పాడాను. మీకు అందులో ఏదైనా తప్పు కనిపించింది అంటే అది మీరు చూసే దానిలో లోపం ఉన్నట్లే. నేను ఆ వీడియోలో ఎక్కడా లిప్ సింక్ చేయలేదు. మీరు కావాలంటే యూట్యూబ్ కు కంప్లైంట్ చేయండి. ఆ కీర్తనలో ఏదైనా తప్పు ఉంటే దేవుడే ఏదొక రూపంలో చూపిస్తాడు” అంటూ శ్రావణ భార్గవి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.