ప్రముఖ నటి రోజా సెల్వమణి.. ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ రోజా.. పలు టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యహరించింది. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె టీవీ ప్రోగ్రాంలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రోజా తన మంత్రి పదవీ బాధ్యతలపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రోజాకు మే 7న చెన్నైలో సినీ ప్రముఖుల చేత సత్కారం జరగనుంది. తాజా సమాచారం ప్రకారం.. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ దర్శకనిర్మాతల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు రోజాకు ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ప్రముఖ సీనియర్ డైరెక్టర్ భారతీరాజా ముఖ్యఅతితగా విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి బుధవారం (ఏప్రిల్ 27న) అన్నాశాలైలోని ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకులు భారతీరాజా.. నటిగా కెరీర్ ప్రపంభించి ఇప్పుడు మంత్రిగా రోజా ఎదిగిన తీరుపై అభినందించారు. ఇదిలా ఉండగా.. సమావేశంలో పాల్గొన్న రోజా భర్త సెల్వమణి స్పందించి.. రోజా కోసం అభినందన సభను ఏర్పాటు చేయనున్నందుకు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి కృతజ్ఞతలు తెలిపారు. మరి నటి నుండి రాష్ట్ర టూరిజం మంత్రిగా ఎదిగిన రోజాకు పై సన్మాన సభ నిర్వహించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.