దేశంలో కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచి పేద ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చిన రియల్ హీరో సోనూ సూద్.. కష్టాల్లో ఉన్నవాకి సాయం చేస్తూ అభినవ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలలో విలన్ పాత్రలో నటించే సోనుసూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా అందరి మదిలో నిలిచిపోయారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనుసూద్ తనకు సహాయం చేయమంటూ అభ్యర్థించిన వారందరికీ ఎంతో మంచి మనసుతో తనకు తోచిన సహాయం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నాడు. తాజాగా సోనుసూద్ మరొక చిన్నారి విషయంలో కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంతోని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు బాబు జన్మించాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు.
ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు. వెంటనే స్పందించిన సోనుసూద్ ఖమ్మంలో నివసించే ఆ దంపతులను ముంబైకి రప్పించి అక్కడ మూడు నెలల బాబు సాత్విక్ కి గుండె ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం బాగుందని, తల్లిదండ్రులు కృష్ణ, బిందు తెలిపారు. నిరు పేద చిన్నారి ఆరోగ్య సమస్యను తెలుసుకొని చలించి పోయి, గుండె ఆపరేషన్ చేయించిన నటుడు సోనూసూద్‌కు కల్లూరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు.