మెగాస్టార్ చిరంజీవి ఒక లెజెండ్. తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు. ఈ పేరు అంటేనే ఒక బ్రాండ్. ఈ పేరు ఎంతోమందికి ఆదర్శం, ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి ఒక కొండంత అండ, ఎదగాలనుకునేవారికి ఒక ధైర్యం. చిరంజీవిలా అవుదామని, ఎదుగుదామని ఎంతోమంది ఆయనను చూసి పెరుగుతారు. అంతటి ఖ్యాతి, కీర్తి, పేరు, ప్రతిష్టలు.. వీటన్నటికంటే ఎక్కువగా కొన్ని వందల కోట్ల విలువ చేసే అభిమానగణాన్ని సంపాదించుకున్నటువంటి అపర కోటీశ్వరుడు. స్వయంకృషికి అర్థం ఏంటి అని అడిగితే చిరంజీవి పేరు చూపిస్తారు. ఇందులో నో డౌట్ అసలు. శిఖరం అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఉంటారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అదే చెక్కు చెదరని చిరునవ్వుతో సమాధానం చెబుతారే తప్ప కోప్పడరు.
తనను తిట్టిన వారిని సైతం నవ్వుతూ పలకరించి గుండెకు హత్తుకోగల సానుకూల వ్యక్తిత్వం చిరంజీవి. శత్రువు అని గిట్టనివారు అనుకోవడమే తప్ప చిరంజీవి అనుకోరు. అలాంటి సౌమ్యుడైన చిరంజీవి మీద గత కొన్నేళ్లుగా దాడి జరుగుతూనే ఉంది. ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని వర్గాలు వీలు దొరికినప్పుడల్లా ఆయన మీద విషం చిమ్ముతూనే ఉంటాయి. ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా పెద్దగా పట్టించుకోవు. ప్లాప్ అయితే పనిగట్టుకుని ప్రచారం చేస్తాయి. రాజకీయాల్లోకి వద్దామనుకుంటే అక్కడ కూడా ఆయన మీద విష ప్రచారం చేశారు. తొక్కే ప్రయత్నం చేశారు. మనసుకి గాయం చేశారు. సినిమాల్లో ఎదుగుతున్న, రాజకీయాల్లోకి వద్దామనుకున్న చిరంజీవి మీద ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉన్నారు.
ఆయన మాట్లాడితే వచ్చే వీడియో కంటెంట్ల మీద బతుకుతూ ఆయన మీదే విషం చిమ్ముతూ వచ్చారు. ఆయన వల్ల డబ్బు సంపాదించుకుంటూ రాళ్లు విసిరేవారు. పైకి మెగాస్టార్ ని పొగుడుతూనే లోపల విపరీతమైన కుళ్ళుతో చచ్చిపోతున్నారు. ఇప్పటికీ కూడా ఆయన మీద విషం చిమ్ముతున్నారు. దీనికి ఈ రెండు, మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే కారణం. చిరంజీవికి క్యాన్సర్ అంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ ఆయన అలా అనలేదు. గతంలో పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. టెస్టులు చేయించుకోకపోయి ఉంటే క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నారు. ఇందులో ఆయనకు క్యాన్సర్ ఎక్కడ నుంచి వచ్చింది? క్యాన్సర్ అని ఎక్కడన్నారు? కానీ చిరంజీవి ఎదుగుదలను ఓర్వలేని కొన్ని వర్గాలు, మీడియా సంస్థలు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలను వక్రీకరించి ఆయన ఇమేజ్ ని తగ్గించాలని చూశారు.
కానీ వాళ్లకు తెలియంది ఏంటంటే.. చిరంజీవి ఆకాశం. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి వాళ్ళ మీదనే పడుతుంది. అభిమానుల గుండెల్లో ఆయన స్థానం వేరే. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. దాన్ని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పోగొట్టలేరు. చిరంజీవి నుంచి అభిమానులను, అభిమానుల నుంచి చిరంజీవిని దూరం చేయలేరు. చిరంజీవి ఇమేజ్ అనేది అణువంత కూడా చెక్కు చెదరదు. ఆయన ఇనుము, కాల్చితే కత్తి అవుతారు. ఆయన మట్టి, తొక్కితే ఇటుకవుతారు. ఆయన రాయి, గాయం చేస్తే దేవుడవుతారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా ఎలా మార్చుకోవాలో దిశా నిర్దేశం చేసే గురువు కూడా అవుతారు. చూసి నేర్చుకుంటే మరో చిరంజీవి అవుతారు, అసూయ లేకుండా.