టాలీవుడ్ దిగ్దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కే విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. కళాతపస్విని ఆఖరి చూపు చూసేందుకు సినీ తారలతో పాటు ప్రేక్షకులు, అభిమానులు అశేష స్థాయిలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం బ్రాహ్మణ సాంప్రదాయక లింగధారుల పద్ధతిలో విశ్వనాథ్‌కు అంత్యక్రియలు జరిగాయి. ఇదిలాఉండగా.. కే విశ్వనాథ్ మీద సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
కే విశ్వనాథ్ సినిమాల్లో హిందూ భావజాలం, శాస్త్రీయ సంగీతం గొప్పతనం వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే ఆయనపై ఇప్పుడు కొంతమంది విమర్శలకు దిగుతున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. జంధ్యం ధరించే కళాతపస్విని ‘కేబుల్ తపస్వి’ అంటూ దుర్భాషలాడుతున్నారు. ఇది నిజంగా శోచనీయం. తన సినిమాల ద్వారా తెలుగు చిత్రసీమను శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకదిగ్గజాన్ని ఇలా విమర్శించడం ఎంతవరకు సబబో వారికే తెలియాలి. శాస్త్రీయ సంగీతంతో పాటు భరతనాట్యం, కూచిపుడి లాంటి లలిత కళలను తన సినిమాల ద్వారా బతికించేందుకు ప్రయత్నించిన విశ్వనాథ్‌ను విమర్శించడం సరైనదా కాదా అనేది వారే ఆలోచించుకోవాలి. కాగా, పద్మ శ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి జాతీయ పురస్కారాలను గెలుచుకున్న విశ్వనాథ్‌ను విమర్శించడంపై ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ సినీ యవనికపై తెలుగు పతాకం ఎగురవేసేందుకు అహర్నిషలు కృషి చేసిన విశ్వనాథ్‌ను ఓ మతానికో, ఓ కులానికో పరిమితం చేసి చూడటం సరికాదు. ఆయన భారతీయ సాంప్రదాయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకున్నారే తప్ప.. ఎక్కడా తన సినిమాల్లో మతాలు, కులాలు ప్రస్తావన తీసుకురాలేదు విశ్వనాథ్. ఇవన్నీ అర్ధం చేసుకోకుండా ఓ మహానుభావుడు నిష్కమించిన సమయాన.. సంయమనం పాటించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరమైన విషయం. మంచి విషయాలకు, సమాచార జ్ఞానానికి వేదిక కావాల్సిన సోషల్ మీడియాను ఇలా చెడు కోసం వినియోగించడం కూడా సరైన పద్ధతి కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఇలాంటి సమయంలో కూడా కళాతపస్విపై విమర్శలు గుప్పిస్తున్న వారి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.