‘బింబిసార’ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కల్యాణ్ రామ్ హీరోగా సొంత బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి దూసుకుపోతోంది. కేవలం మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.29.8 కోట్ల గ్రాస్, రూ.18.1 కోట్ల షేర్ రాబట్టింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ, ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌ని ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అన్నదమ్ములుగా నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ బంధాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఒకరి కోసం ఒకరు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంటారు. కల్యాణ్ రామ్ ఎప్పుడూ తన తమ్ముడిపై ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా అన్నపై తన ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. అన్న విజయం సాధిస్తే ఆనందపడే వాళ్లలో తారక్ ముందు వరుసలో ఉంటాడు.
నటనలో తాతకు తగ్గ మనవడిగా తారక్ తనని తాను నిరూపించుకున్నాడు. రాజకీయాల్లోనూ తెలుగుదేశం కోసం గతంలో ప్రచారం చేయడం కూడా చూశాం. ఇప్పడు మారిన పరిస్థితుల దృష్ట్యా రాజకీయానికి దూరంగా ఉన్నాడు. అంతేగానీ ఎప్పటికీ తాను తెదేపా మద్దతుదారుడినే అని బాహాటంగానే చెప్పాడు. అయితే బింబిసార విజయం సాధించిన తర్వాత కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కల్యాణ్ రామ్ అసలైన నందమూరి వారసుడు అంటూ పోస్టులు పెట్టడంతోనే అసలు రచ్చ మొదలైంది.
అవసరం, సందర్భం వచ్చిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. బింబిసార సినిమా కోసం కల్యాణ్ రామ్ పిలవగానే వచ్చి ఎంత ప్రమోషన్ చేశాడో చూశారు. సినిమా గురించి, కల్యాణ్ రామ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసు. నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇంత చేస్తున్నా కొందరు మాత్రం విషం చిమ్ముతూనే ఉన్నారు. కల్యాణ్ రామ్- జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా ఉన్నా వీళ్లు మాత్రం అభిమానం పేరుతో అక్కసు వెళ్లగక్కుతున్నారు.
నందమూరి ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్ ను నెటిజన్లు సైతం ఖండిస్తున్నారు. అన్నదమ్ములుగా వాళ్లు బానే ఉన్నారని.. ఇలాంటి వాళ్లే కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రాచారాలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నా తప్పులేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బింబిసార సాధించిన విజయం, జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.