ఎన్నో అద్భుతమైన పాటలను, మరుపురాని సాహిత్యాన్ని మనకు అందించి.. ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎందరికో స్ఫూర్తిని, ఉత్సహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప సినీ కవి కన్నుమూసే కొన్ని రోజుల ముందు ఒక దర్శకుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతారామశాస్త్రి చివరిసారిగా మాట్లాడిన ఆ మాటలు ఆయన అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా శాస్త్రి ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు చెప్పారు. తనకు లంగ్ ఆపరేషన్ ఫిక్స్ అయినట్లు తెలియజేశారు. వాసు సినిమాకు రాయాల్సి ఉందని, కానీ రెండు నెలలు రాయలేనన్నారు. డిసెంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాక పాట రాస్తానన్నారు.
తాను మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తానని ఆయన బలంగా నమ్మినట్లు ఆయన మాటలు వింటే అర్థం అవుతోంది. ఆయన నవ్వుతూ చెప్తున్న ఆ మాటలు వింటుంటే కళ్లు చెమరుతున్నాయి. కానీ విధి ఆయనపై జాలి చూపలేదు.. సాహితీ వెన్నెలను మన నుంచి దూరం చేసింది.
ఇదీ చదవండి: సిరివెన్నెల సీతారామశాస్త్రి బయోగ్రఫి