అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ వస్తున్న ఆరోపణలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పు ఉందని వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. అందుకే చూసేవన్నీ తప్పుగా కనిపిస్తాయని, దుప్పటి కప్పుకుని కూర్చున్నా, చూపులో లోపం ఉంటే అశ్లీలంగానే కనిపిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రావణ భార్గవి.
వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసే సమయంలో భక్తి భావంతో పాడుకునే కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసిందని.. అన్నమయ్య కీర్తనను తన అందాన్ని వర్ణించడానికి ఉపయోగించుకోవాడాన్ని తప్పుపడుతున్నారు పలువురు పెద్దలు. ఆ వీడియోలో శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపించడం, కాళ్లు ఊపడం, పడుకుని కీర్తన పాడటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని అన్నమయ్య వంశస్తులు అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన శ్రావణ భార్గవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఆ వీడియోలో ఆశ్లీలత ఎక్కడ కనిపించింది. నేను ఎంత భక్తితో పాడానో ఆ పాట నాకు తెలుసు. ఎందుకు డిలీట్ చేయాలని అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. మీకు ఆ వీడియోలో ఏం కనిపించింది. నేనేం లిరిక్ మార్చి పాడలేదు. సంగీతంలో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అది మొత్తం పెట్టి పాడాను.
నేను పడుకుని చేయడంలో తప్పేం ఉంది. కనీసం ఆ వీడియో లింప్ సింక్ కూడా లేదు. మీ చూపులో తప్పులేకపోతే మీకు అది తప్పుగా కనిపించదు. నా అంతరాత్మకి తెలుసు. నేను తప్పుచేయలేదని.. దాన్ని మీరు తప్పంటున్నారు కాబట్టి.. మీరు తీసుకోవాల్సిన యాక్షన్ మీరు తీసుకోండి. యూట్యూబ్ వాళ్లతో మాట్లాడుకుని మీరు ఏం చేస్తారో చేసుకోండి.
నా మనసుకి అందులో తప్పు కనిపించడం లేదు. ఇది నేను దైవం సాక్షిగా చెప్తున్నా నేను కూడా బ్రాహ్మిణే. నేనూ పూజలు చేస్తా, వ్రతాలు, నోములు కూడా చేస్తా. ఈ పాట అమ్మవారి గురించి. మీ ఇంట్లో అమ్మాయి పుడితే అమ్మవారిగానే భావిస్తాం కదా. ఇప్పుడు నేను అదే కదా.. స్త్రీ అంటే అమ్మవారే కదా. స్త్రీని తప్పుగా చూపించలేదు.
నేను కాళ్లు ఊపుతూ చేశానని అంటున్నారు.. ఒక అమ్మాయి తన ఇంట్లో తనకి నచ్చినట్టుగా ఉంది. తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో అలా చూపించాం. తినే వంటకాల దగ్గర నుంచి పుస్తకం వరకూ అన్నీ తెలుగు సాంప్రదాయమే కనిపిస్తుంది. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్ప. ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. ప్రాబ్లం నాది కాదు. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు.
మీరు తీయమంటే తీయడానికి మీరు దేవుడు కాదు. దేవుడికి నచ్చకపోతే ఆ వీడియో అసలు బయటికి రాదని నా నమ్మకం. నాకు తప్పని అనిపించడం లేదు. మీరు ఆ వీడియోను చూస్తే అమ్మవారే కనిపించాలి. మొత్తం దుప్పటి కప్పుకున్న అమ్మాయి కూడా మీకు అశ్లీలంగా కనిపిస్తుంది. మీ చూపు బాలేకపోతే. మీ చూపులో లోపం ఉంది నా పాటలో కాదు’ అంటూ తన వాదనను వినిపించింది శ్రావణ భార్గవి. ప్రస్తుతం శ్రావణ భార్గవి మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి: అన్నమయ్యకు అవమానం.. వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి!