సాధారణంగా లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సక్సెస్ అయినవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఈజీగా పేరెంట్స్ సంపాదించిన ఆస్తిపాస్తులతో సెటిల్ అయ్యేవారు ఓ రకమైతే, పేరెంట్స్ కి దూరంగా ఉండి సొంత టాలెంట్ తో పైకొచ్చేవారు అరుదుగా కనిపిస్తుంటారు. అయితే.. పుట్టుకతో అమ్మాయి వాయిస్ కలిగిన ఓ అబ్బాయి జీవితం కథ వింటే కన్నీళ్లు ఆగవు.
అతని పేరు శ్రీ సాయి సన్విద్.. వైజాగ్ లో పుట్టిపెరిగిన అతనికి చిన్నప్పటి నుండే గొంతు స్వరం అమ్మాయిలా ఉండటంతో అందరూ హేళన చేసేవారు. పెరిగే కొద్దీ అవమానాలు భరించలేక సొంత ఊరు వదిలి.. తనకు శాపంగా మారిందనుకున్న లేడీ వాయిస్ తోనే సింగర్ అవ్వాలనే లక్ష్యంతో.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా హైదరాబాద్ కు పయనమై వచ్చేశాడు.
హైదరాబాద్ లో చేరదీసేవారు లేక నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో బెంచీలపై పడుకునేవాడు.. సెక్యూరిటీ తరిమితే బస్ స్టాపుల్లో సేదతీరేవాడు. సరిగ్గా రెండు నెలలకు ఓ క్యాన్సర్ పేషేంట్ తల్లి.. ఈ యువగాయకుడిని గుర్తించి చేరదీసింది. తాను తెచ్చుకున్న ఆహారంలోనే ఇతనికి సగం పెట్టి చేయూతనిచ్చింది. అతనికి వెన్నంటి మనోధైర్యాన్ని నింపింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అతను ఒక ఫేమస్ సింగింగ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాడు. అతను శాపంగా భావించిన అదే లేడీ గాత్రం.. నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.. నీ స్వరం అరుదైన వరం అంటూ జడ్జిలు, ప్రేక్షకులు సైతం కొనియాడేలా చేస్తోంది. ప్రస్తుతం సాయి సన్విద్.. జీతెలుగులో ప్రసారమవుతున్న ‘సరిగమప.. నెక్స్ట్ సింగింగ్ సూపర్ స్టార్’ లో కంటెస్టెంట్ గా తన ప్రతిభను చాటుకుంటున్నాడు.
తాజాగా సాయి సన్విద్ పాడిన ‘అంత ఇష్టం‘ పాట యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా కోసం ప్రముఖ గాయని చిత్ర పాడిన ఈ పాటతో.. ఈ యువ గాయకుడు అందరినీ ఫిదా చేశాడు. అలాగే తన లైఫ్ స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టుకొని.. అందరినీ ఎమోషనల్ చేశాడు. ప్రస్తుతం సాయి సన్విద్ పాడిన పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.