సమాజంలో జరిగే సంఘటనలపై రెగ్యులర్ గా స్పందించే సినీ సెలెబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సింగర్ చిన్మయి శ్రీపాద ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అందరికి సుపరిచితురాలు. అయితే.. అటు కెరీర్ పరంగా బిజీ ఉంటూనే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు సూటిగా చెప్పేస్తుంటుంది. ముఖ్యంగా మహిళల విషయాలలో చాలా అలర్ట్ గా ఉంటుంది. దీంతో తాజాగా పెళ్లిలో ఆడపడుచు కట్నం, బామ్మర్ది కట్నాల విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది చిన్మయి. ఇటీవల ఆడపడుచు కట్నం గురించి చెప్పండని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. నెటిజన్స్ నుండి భారీ స్పందన వచ్చిందని చెప్పింది చిన్మయి.
ఈ విషయంపై చిన్మయి మాట్లాడుతూ.. “ఆడపడుచు లేని వారు కూడా ఆడపడుచు అని కట్నం తీసుకుంటున్నారు. పెద్దమ్మ వాళ్ల కూతుర్లకి అని, కజిన్స్ కి అని చెప్పి ఒక్కొక్కరికి రూ. 50 వేల నుండి రూ. 2 లక్షల వరకు కట్నం అడుగుతున్నారట. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఆడపడుచు లేనప్పుడు అత్తగారి కట్నం, బామ్మర్ది కట్నం అడుగుతున్నారట. అసలు బామ్మర్ది కట్నం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పట్లో మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు. ఎలా కట్నం దొబ్బేయాలని కూర్చొని మరీ ఆలోచిస్తారన్నమాట’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మరి. కొందరు ఆమె మాటలకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో!