ఈమధ్య డ్రోన్ కెమెరాల వాడకం బాగా పెరిగింది. పెళ్లిళ్లతో పాటు ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా డ్రోన్లు ఉపయోగించడం తప్పనిసరిగా మారింది. ఇక, సినిమా ఈవెంట్లు, మ్యూజిక్ కాన్సర్ట్ల్లో అవి కంపల్సరీగా మారాయి. అయితే అలాంటి ఓ ఈవెంట్లో డ్రోన్ కెమెరా వల్ల స్టార్ సింగర్ గాయాలపాలయ్యాడు. అసలేం జరిగిందంటే..!
దక్షిణాది సినిమాలను తమ గాత్రంతో షేక్ చేస్తున్న వారిలో బెన్నీ దయాల్ ఒకడు. కేరళకు చెందిన ఈ మలయాళీ సింగర్ ఇప్పటివరకు 3 వేలకు పైగా పాటలు పాడాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో వందలాది గీతాలను ఆయన ఆలపించాడు. కెరీర్ మొదట్లో ఎన్ని పాటలు పాడినా రానటువంటి పేరు.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సినిమాల్లో పాడితే వచ్చింది. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాల్లో బెన్నీ ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. తెలుగులోనూ పలు హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నాడు. ‘కుందనపు బొమ్మ’, ‘అరిమా అరిమా’, ‘జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్లు ఉందిరో’, ‘బార్బీ బొమ్మకు’, ‘ఢిల్లకు ఢిల్లకు’, ‘సిండ్రెల్లా’ లాంటి ఎన్నో విజవంతమైన గీతాలను బెన్నీ దయాల్ ఆలపించాడు.
సినిమాలతో పాటు వీలు చిక్కినప్పుడల్లా స్టేజీ షోలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు చేస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకోవడంలో బెన్నీ దయాల్ ముందుంటాడు. అలాంటి బెన్నీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజరీ (వీఐటీ)లో నిర్వహించిన మ్యూజిక్ షోలో బెన్నీ పాడుతుండగా ప్రమాదవశాత్తూ ఓ డ్రోన్ కెమెరా వచ్చి ఆయన తల భాగానికి వెనుక వైపు గట్టిగా తగిలింది. దీంతో ఆయన వెంటనే కింద కూర్చుండిపోయాడు. తలతో పాటు ఆయన చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని బెన్నీ చెప్పాడు. తన కోసం ప్రార్థించిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్ చేసే సమయంలో డ్రోన్లు తమ దగ్గరకు రాకుండా ఆర్టిస్టులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు.
Famous Indian singer Benny Dayal gets hit by a drone in VIT Chennai!#BreakingNews #BennyDayal #India pic.twitter.com/o4eK2faetF
— Aakash (@AakashAllen) March 2, 2023