హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు తలుపుతట్టి.. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా.. అనూహ్యంగా అనారోగ్యంతో కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి.. అక్కడే మృతి చెందారు. రీల్ మీద విలన్‌గా చేసినప్పటికి.. నిజజీవితంలో ఎందరికో సాయం చేసి.. మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. ఆయన బతికుండగా ఎందరికో సాయం చేసి.. ఆదుకున్నారు. కానీ శ్రీహరి మృతి చెందిన తర్వాత వారంతా కనీసం పలకరించడానికి కూడా రాలేదని.. ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతోనే అలా చేశారని శ్రీహరి భార్య శాంతి చెప్పుకొచ్చారు. తమకు డబ్బులివ్వాల్సిన చాలా మంది శ్రీహరి మృతి తర్వాత పత్తా లేకుండా పోయారని.. ఆఖరికి అప్పులు తీర్చడం కోసం తన నగలు, కార్లు అమ్మానని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు శాంతి.
ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ..‘‘బావకు నటించిన సినిమాలకు గాను తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ సరిగా ఇచ్చి ఉంటే.. నేను మరో 10 ఇళ్లు కొని ఉండేదాన్ని. చిరంజీవిగారి సంస్థ సహా మరో రెండు, మూడు సంస్థలే బావకి రెమ్యునరేషన్‌ను కరెక్ట్‌గా ఇచ్చేవాళ్లు. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. అయితే బావకి సినిమా అంటే పిచ్చి. అందుకే నేను కూడా డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు.. సినిమాలు చేయమని చెప్పేదాన్ని. 40-50 ఏళ్లు వచ్చినా తండ్రిగానో, అన్నగానో ఏదో ఒక వేషం వస్తుంది.. ఆయనకు కూడా ఆసక్తి కదా.. అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఇక మాకు డబ్బులు ఇవ్వాల్సిన చాలా మంది బావ చనిపోయిన తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దాంతో ప్రసుత్తం మేం ఉంటున్న ఇంటి మీద చేసిన అప్పులు తీర్చడం కోసం నా నగలు, కార్లు అమ్మాను’’ అని చెప్పుకొచ్చారు.
‘‘నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే.. బావ చనిపోయిన తర్వాత.. శాంతి ఏం చేస్తుందని నా గురించి ఆరా తీసేవారు.. అడిగేవారు. కానీ నేను సినిమాలకు దూరం అయ్యాను కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఇవన్ని మాములే. శ్రీహరి చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు మా ఇంటికి కాల్ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్ చేశారంట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేయలేదు’’ అన్నారు శాంతి. మరి ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.