నటీమణుల మార్ఫింగ్ ఫొటోలు ఆన్‌లైన్‌లో ఉంచి వేధించటం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. మార్ఫింగ్ ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి డబ్బు సంపాదించటం కోసమే.. లేదా టార్గెట్ చేసిన నటిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు. కేవలం ఫొటోలు మాత్రమే కాదు.. వీడియోలు సైతం మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. దీని వల్ల బాధిత నటీమణలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఎంతో కృంగుబాటుకు లోనవుతున్నారు. తాజాగా, ఓ కీచకుడి కారణంగా ప్రముఖ తమిళ సీరియల్ నటి రెండో సారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళ సీరియల్ నటి ప్రవీణా నాయర్ ‘‘రాజారాణి’’ సీరియల్‌తో తమిళంలో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. మరికొన్ని సీరియల్స్‌లోనూ నటిస్తూ ఉన్నారు.
తమిళ సీరియల్స్‌తో బిజీబిజీగా గడుపుతున్న ఈమెకు ఓ కీచకుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే స్టూడెంట్ ప్రవీణా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు. విషయం తెలుసుకున్న నటి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జైల్లో ఉన్న అతడు బెయిల్ మీద రిలీజయ్యాడు. కొన్ని నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలోనే ప్రవీణాకు షాక్ తగిలింది. ఈ సారి ఆమె కూతురు గౌరీ నాయర్‌ను కూడా టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోలు విడుదల అయ్యాయి. దీంతో ఆమె తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతుర్ని టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ సోషల్ మీడియాలో ఉన్న నా మిత్రుల ద్వారా ఈ విషయం తెలిసింది. భాగ్యరాజ్ అనే వ్యక్తి నావి, నా కూతురివి, నా మరదలివి మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ చేశాడు. నా పేరుతోనే అకౌంట్ క్రియేట్ చేసి వాటిని అందులో ఉంచుతున్నాడు. నా పేరుతో 100 ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు. నా ఫేక్ ఫొటోలు అందరికీ పంపుతున్నాడు. అతడు నా కూతుర్ని కూడా వదల్లేదు. నా చుట్టూ ఉన్న అందరు మహిళల్ని అతడు టార్గెట్ చేశాడు. కొంతమంది ఇలా సైకోల్లా ఉంటారు’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, మార్ఫింగ్ ఫొటోలతో నటి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న సైకోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.