కరుణ భూషణ్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగుతోంది. ఈ క్రమంలో సదరు నటి వివరాలు తెలుసుకునేందకు నెటిజనులు ఆసక్తి చూపుతున్నారు. ఆమె వివరాలు ఇవి..
కరుణ భూషణ్ అనగానే వెంటనే గుర్తు పట్టలేం.. కానీ మొగలి రేకులు సీరియల్ దేవి అనగానే చాలా మంది టక్కున గుర్తు పడతారు. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ చరిత్రలో మొగిలిరేకులు సీరియల్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సీరియల్ సెకండ్ పార్ట్‌లో మున్నా-దేవీల పార్ట్ కీలకం. తొలుత దేవి పాత్రలో వేరే అమ్మాయి నటించగా.. ఆ తర్వాత ఆ స్థానంలోకి కరుణ భూషణ్ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తూ.. సందడి చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా కరుణ భూషణ్ పేరు తెగ వైరలవుతోంది. దాంతో జనాలు అసలు ఎవరీ కరుణ భూషణ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీకోసం ఆ వివరాలు..
కరుణ భూషణ్ తండ్రి తెలుగు వ్యక్తి కాగా.. తల్లి మరాఠీ మహిళ. 1988, జూన్ 15న హైదరాబాద్‌లో జన్మించింది. కరుణ భూషణ్ తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమె బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. కరుణ భూషణ్.. చిన్నతనం నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఆమె ఆసక్తి గమనించి తల్లిదండ్రులు.. కరుణ భూషణ్‌ను బాలభవన్‌లో జాయిన్ చేశారు. అక్కడ ఆమె క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. తర్వాత కాలంలో ఈ ట్రైనింగ్ ఆమెకు ఎంతో ఉపయోగపడింది.
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై 1998లో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ఆహా చిత్రం ద్వారా బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కరుణ. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ యాక్టర్లు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సిద్ధార్థ్‌లతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. ఆమె మా టీవీలో విహారి ది ట్రావెలర్ అనే టీవీ ట్రావెల్ షోకి యాంకరింగ్ చేసింది. సుమారు పది సంవత్సరాలు పాటు ఈ షోకు యాంకర్‌గా వ్యవహరించింది. ఇక 2007లో మా టీవీలో ప్రసారం అయిన యువ సీరియల్ ద్వారా తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె లవ్ సీరియల్, పసుపు కుంకుమ, మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, నువ్వా నేనా, అభిషేకం, నాతిచరామి వంటి పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తోంది.
‘అభిషేకం’ సీరియల్‌లో ఆమె అందం, అభినయాన్ని బుల్లితెర ఆడియన్స్ మర్చిపోలేరు. ప్రస్తుతం ‘వైదేహి పరిణయం’ సీరియల్‌లో కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో అద్భుతంగా నటిస్తోంది కరుణ భూషణ్. ఆమెకు వివాహం అయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది కరుణ భూషణ్.