టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ముందుగానే ఒక మాట అనుకుని వెళ్లినట్టు వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్ దర్శకుడు సాగర్, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి చెందగా.. ఇవాళ చెన్నైలో గాయని వాణీ జయరాం కన్ను మూశారు. వీరి మరణ వార్తలను మరువకముందే మరొక చేదు వార్త ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ నిర్మాత శనివారం కన్నుమూశారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి హీరోలతో పని చేసిన స్టార్ ప్రొడ్యూసర్ గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని ఆయన నివాసంలో కన్నుమూశారు.
నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్.వి. గురుపాదం (54) గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగులో చిరంజీవి, కృష్ణంరాజు కాంబినేషన్ లో పులి బెబ్బులి, ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో ‘వయ్యారి భామలు – వగలమారి భర్తలు’ రెండు మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించారు. ఇవే కాకుండా సొమ్మొకడిది సోకొకడిది, తిరుపతి క్షేత్ర మహత్యం వంటి సినిమాలను కూడా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 25కు పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. బాలీవుడ్ లో శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ‘అకల్ మండ్ చిత్రానికి నిర్మాతగా పని చేశారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా తీసుకొచ్చారు. నిర్మాత మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.