జీనా యహా..
మర్ నా యాహా..
ఇస్ కే సివా జానా కహా..
అవును.. జానా కహా..
ఎక్కడికి.. ఏమో?
ఎక్కడకో తెలియదు..
దేహాన్ని వదిలేసిన ఆత్మ ఏ అంతు తెలియని దూరాలకు, ఏ అంతం తెలియని తీరాలకు తరలి వెళ్తుందో తెలియదు. ఆత్మ శరీరాన్ని వదిలేయడంతోనే జీవితం అంతమవుతుంది. అవును.. చాలామంది జీవితాలు అలాగే ముగుస్తాయి. జీవం ఉన్నంతవరకే జీవితం. కానీ అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల మధ్య కాలమే జీవితం కాదు.. మరణించాక కూడా ప్రతి మదిలో.. ప్రతి ఎదలో పదిలంగా నిలిచిపోయే శాశ్వత యశస్సును సొంతం చేసుకోటమే జీవితానికి నిజమైన అర్థం.. పరమార్థం.
అయితే 80- 90 ఏళ్ల పాటు పరిపూర్ణ ఆయువుతో నిండు జీవితాన్ని అనుభవించిన వారి మరణం కంటే నాలుగు పదుల వయసులోనే ఆచంద్రతారార్కంగా నిలిచిపోయే శాశ్వత కీర్తి ప్రతిష్టలను సాధించుకున్న వారి నిష్క్రమణం అత్యంత శోచనీయం అవుతుంది. అలాంటి దిగ్భ్రాంతికరమైన అనూహ్య మరణాలలో కన్నడ చిత్రరంగపు యువరాజు పునీత్ రాజ్ కుమార్ మరణం ఒకటి. నమ్మశక్యం కాని ఆ మరణ వార్త ఇన్ జనరల్ గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని.. ఇన్ పర్టిక్యులర్ గా మొత్తం కన్నడ రాష్ట్రాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
నిజానికి దేశంలో రోజూ ఎన్నో వేలమంది చనిపోతుంటారు. ఎన్నో జీవితాలు పశ్చిమాద్రిలో అస్తమిస్తుంటాయి. ఇవాళ పోతే రేపటికి రెండు.. అనే నిర్వేదం అందరినీ కమ్మేస్తుంది. కానీ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని అలాంటి సాధారణ నిర్యాణంలా కాకుండా ఒక మహోజ్వల మానవతా మూర్తి మహాభినిష్క్రమణంలా భావించి రోదిస్తోంది కన్నడ ప్రజ. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి అతని మరణం తర్వాత కన్నడ దేశాన్ని కమ్ముకున్న విషాద మేఘాలు.కాగా నిన్న అంటే.. మార్చి 17.. పునీత్ రాజ్ కుమార్ జన్మదినం. అంతులేని ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరగవలసిన అతని జన్మదినం నిన్న విషాద రాగాలాపనల మధ్య తొలి జయంతిగా జరగటాన్ని మించిన దురదృష్టం ఏముంటుంది చెప్పండి?
అందరూ ఆప్యాయంగా “అప్పు” అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ” జేమ్స్” ను అతని జన్మదిన కానుకగా రిలీజ్ చేయటంతో కర్ణాటక రాష్ట్రంలో ఆనంద విషాదాల సమ్మిళిత దృశ్యాలు దర్శనమిచ్చాయి.నిన్న కర్ణాటక మొత్తం పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకాల పునఃశ్చరణతో పులకించిపోయింది. ఆనంద విషాదాల మిశ్రమ భావోద్వేగాలతో ఊగిపోయింది. కేవలం 46 ఏళ్ల వయసులోనే ఒక సినీ తార మరణించడం బాధాకరమే.. కానీ కన్నడ చిత్ర పరిశ్రమ, కన్నడ ప్రజానీకము మరీ ఇంతగా చలించి, జ్వలించి పోవటం ఏమిటి..? ఎందుకు? అన్నది ఒక ఆశ్చర్యకరమైన సందేహం.
ఎందుకంటే అతను కన్నడ చిత్ర రంగపు మకుటం లేని మహారాజు, కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు కావటం వల్లనా? ప్రజాబాహుళ్యంలో విశేష ప్రాచుర్యం కలిగిన పవర్ స్టార్ ఆఫ్ కర్ణాటక కావటం వల్లనా..? ప్రతిష్టాత్మక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వాడు కావటం వల్లనా..? ఇలాంటి ఘనమైన నేపథ్యం, పాపులారిటీ, చరిష్మా చాలామంది సినీ స్టార్స్ కి కూడా ఉంటాయి కదా..! మరి పునీత్ రాజ్ కుమార్ ప్రత్యేకత ఏమిటి..?
పైన చెప్పిన నేపథ్య ప్రత్యేకతలకు అతీతమైన ప్రత్యేకత ఒకటి అప్పును అందరివాడుగా నిలిపింది. కుటుంబ నేపథ్యం, డబ్బు, కీర్తి వీటన్నింటికంటే తనలోని మానవతా కోణమే అతన్ని మహోన్నతున్ని చేసింది అన్నది వాస్తవం.. అదే వాస్తవం.
మనిషి ఎంత గొప్పవాడైనా కావచ్చు.. ఎంతటి మేధావి అయినా కావచ్చు.. సకల విద్యాపారంగతుడు కావచ్చు.. అష్టైశ్వర్య సంపన్నుడు కావచ్చు.. ఇలాంటి ఘనతలు, గొప్పలు ఎన్ని ఉన్నప్పటికీ అతనిలో దాతృత్వ లక్షణం లేకపోతే అవన్నీ నిష్ప్రయోజనమే.. అది అంగవైకల్య సమానమే. పునీత్ రాజ్ కుమార్ లోని సమస్త సత్ లక్షణాలకు వన్నె తెచ్చింది.. అతన్ని కన్నడ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రడిని చేసింది ఆయనలోని దాతృత్వ లక్షణమే.. మానవతా కోణమే. మానవత అంటే కేవలం జాలి, దయ, కరుణ మాత్రమే కాదు. కన్నడ చిత్ర రంగ మొత్తం ‘అప్పు’ను అక్కున చేర్చుకోవడానికి మరో ప్రధాన కారణం అతని సత్ప్రవర్తన. పెద్ద – చిన్న, పేద- ధనిక అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా, అభిమానంగా పలకరించే నిష్కల్మష, నిరాడంబర వ్యక్తిత్వమే పునీత్ రాజ్ కుమార్ ను పునీతున్ని చేసింది.
ఎంత సంపాదించాం.. ఎన్ని తరాలకు సరిపడా వెనకేసుకున్నాం అని మాత్రమే ఆలోచించే వారికి సంపాదన అంటే ఆస్తి మాత్రమే. కానీ పునీత్ రాజ్ కుమార్ లాంటివారికి సంపాదన అంటే అస్తిత్వం. సంపాదన అంటే దాతృత్వం.. సంపాదన అంటే సత్ప్రవర్తన.. సంపాదన అంటే సమాదరణ. వేల కోట్లు ఉన్నా ఎంగిలి చేత్తో కాకిని విసరని ధనిక దరిద్రుల కంటే వేలాది జీవితాల్లో వెలుతురు నింపే వితరణశీలత గొప్పది. మరణానంతర జీవితానికి ఆ వితరణ.. ఆ విచక్షణలే ప్రాణవాయువులు అన్న నిజాన్ని చాలామంది డబ్బున్నవాళ్లు గ్రహించలేరు.
ఎలాంటి ప్రచారాన్ని, ప్రతిఫలాన్ని ఆశించకుండా పునీత్ రాజ్ కుమార్ చేసిన, చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలు, విశేషాలు అతని మరణానంతరం మాత్రమే వెలుగుచూశాయి. 45 ఉచిత విద్యా కేంద్రాలు, 25 అనాధ శరణాలయాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, నిర్వహిస్తూ 1800 మంది విద్యార్థులను చదివిస్తున్నారన్న వాస్తవాలు “అప్పు” ఆకస్మిక మరణం తరువాతే వెలుగులోకి వచ్చాయి. బాలనటుడిగా, హీరోగా, నిర్మాతగా, గాయకుడిగా అన్నింటినీ మించి కన్నడ కంఠీరవుని ప్రియ పుత్రునిగా కన్నడ ప్రజానీకంతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధాన్ని పెనవేసుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇంతటి సేవా గుణ సంపన్నుడా అన్న నిజం తెలిసి యావత్ దక్షిణ భారతము పులకించిపోయింది.
అందుకే నిన్న అతని తొలి జయంతిని పురస్కరించుకుని కన్నడ దేశం ఘన నివాళి అర్పించింది. అంతగా ఉర్రూతలూగి పోయింది. తొలి జయంతితో పాటు.. అతని చివరి చిత్రం “జేమ్స్” విడుదలను కలిపి ఒక సంయుక్త మహోత్సవంగా నిర్వహించుకున్నారు కన్నడ ప్రజలు. తమ అభిమాన తార ఆఖరి చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చే దిశగా కదం తొక్కింది కర్ణాటక ప్రజానీకం. నిజానికి నిన్న కర్ణాటకలో జరిగిన కోలాహల దృశ్యాలను చూస్తే.. Living after the death.. అంటే ఇదే కదా అనిపిస్తుంది.
ఊరూరా నీరాజనాలు – భారీ కటౌట్లు, బ్యానర్లు ,ఫ్లెక్సీలు, బ్యాండ్ మేళాలు, లక్షలాది ప్రజలకు ఉచితంగా కాఫీ, టీలు, టిఫిన్లు, భోజనాలు.. ఇలాంటి ఏర్పాట్లతో కర్ణాటకలోని దాదాపు 1200 థియేటర్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మేళ తాళాలతో బాణాసంచాలతో కర్ణాటక మారుమోగిపోయింది. బెంగుళూరుతో పాటు మైసూరు, మంగళూరు, హాసన్, దావణగెరె, కలబెరగి, బెలగావి, విజయపుర వంటి ప్రధాన నగరాలలోనే కాకుండా ఊరూరా ఘననివాళి దక్కింది దివంగత ప్రియతార పునీత్ రాజ్ కుమార్ కు. ఇక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టూడియో దగ్గర నెలకొన్న కోలాహలం వర్ణనాతీతం. ఆయన మరణించిన రోజు నుండి ఇప్పటివరకు అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.
అన్నదమ్ములు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, యువరాజ్ కుమార్, వినయ్ రాజ్ కుమార్ లతో పాటు కన్నడ సినీ ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి అప్పుకు ఘననివాళి అర్పించారు. ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల స్పందించిన తీరు అసాధారణం అనే చెప్పాలి. ఆ రోజు అంత్యక్రియలు, దశదినకర్మ వంటి సందర్భాలలో కర్ణాటక ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను, చేపట్టిన కార్యక్రమాలను గమనిస్తే పునీత్ రాజ్ కుమార్ కు ప్రజలలోనే కాదు.., ప్రభుత్వంలో కూడా ఎంతటి స్థాన విశిష్టత ఉందో అర్థమవుతుంది. అందుకే పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం ఆయనకు “కన్నడ రత్న” బిరుదు ప్రదానం చేసి ఘన నివాళి అర్పించింది కర్ణాటక ప్రభుత్వం.
మహోన్నత వ్యక్తి .. మానవతా మూర్తి అయిన పునీత్ రాజ్ కుమార్ కేవలం “కన్నడ రత్నమే కాదు.. భారత జాతిరత్నం” అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
Hats off Appu…Hats off to You..
You Live forever in the hearts of millions and billions..
మీ ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ..
Signing off
Prabhu…