ఆమె ఒక సీనియర్ నటి. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆస్తులు బాగా సంపాదించారు. భర్త కూడా ఆస్తిపరుడే. అయితే ఆస్తి కోసం ఇంట్లో వారే భర్తను హత్య చేసి, తనను చంపాలనుకున్నారు అని ఆమె ఆరోపణలు చేశారు.
సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు బిందాస్ లైఫ్ ని అనుభవించి చేతిలో చిల్లి గవ్వ లేక నరకం అనుభవించినవాళ్లు ఉన్నారు. సొంత తప్పిదం వల్ల సంపాదించిన ఆస్తి పోగొట్టుకుని కొందరు, మోసపోయి ఆస్తిని కోల్పోయిన వారు కొందరు ఇలా రకరకాలుగా తమ ఆస్తిని కోల్పోయి రోడ్డున పడ్డవారు ఉన్నారు. అయితే ఆస్తి కోసం ఒక సీనియర్ నటిని ఇంట్లో వాళ్ళే హత్య చేయాలని చూశారట. సొంత వాళ్ళే ఆస్తి కోసం భర్తను హత్య చేసి.. తనను కూడా చంపాలని చూశారని ఆమె వెల్లడించారు. సినిమాల్లో ఉన్నట్లే నిజ జీవితంలోనూ విలన్లు ఉంటారనడానికి ఆమె మాటలే నిదర్శనం.
పాత తరం నటులు ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకప్పుడు తాము పడ్డ కష్టాలను, తమ అనుభవాలను తెలియని వారితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి కాకినాడ శ్యామల తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మరో చరిత్ర సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాకినాడ శ్యామల.. ఇంట్లో రామయ్య, వీధిలో క్రిష్నయ్య, నాలుగు స్తంభాలాట, బాబాయ్ అబ్బాయ్ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. తన భర్తను హత్య చేశారని, ఆ నిందను తనపై వేశారని అన్నారు. తన తప్పు లేదని నిరూపించి.. హత్య చేసిన వ్యక్తిని జైలుకు పంపించానని అన్నారు. తన భర్తను హత్య చేసిన వాడికి 18 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేశానని ఆమె తెలిపారు.
ఒకరోజు తాను బయటకు వెళ్లి ఆటోలో వస్తుంటే.. ఆటో డ్రైవర్ తన తలపై కొట్టాడని, నొప్పితో బాధపడుతుంటే కొడుతూనే ఉన్నాడని అన్నారు. అలా కొట్టి కొట్టి తనను కూడా చంపాలని అనుకున్నారని ఆమె అన్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఇదంతా చేసింది బావ కొడుకు, భర్త అన్న కొడుకు బాబ్జీ చేశాడని ఆమె వెల్లడించారు. ఆస్తి కోసం భర్తను హత్య చేసి.. తనను చంపాలని చూశాడని, ఇప్పటికీ ఆస్తి ఆ బాబ్జీనే తింటున్నాడని ఆమె అన్నారు. డ్రైవర్ కి బాబ్జీని ఒరేయ్ బాబ్జీ అని పిలవాల్సిన చనువు ఏముంటుందని.. బాబ్జీనే తన భర్తను చంపించి.. తనను చంపించాలని చూశాడని ఆమె ఆరోపించారు. అది తన అనుమానం మాత్రమే అని.. నిజం దేవుడికి తెలుసునని అన్నారు. తన భర్తను చంపి చివరకు తనను అనాధను చేశారంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. మరి కాకినాడ శ్యామల చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.