సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పాకిస్తాన్ సీరియల్ కం సినీనటుడు సజ్జాద్ కిశ్వర్ తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ళ వయసు పైబడిన ఆయన.. కొంతకాలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఆయనకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1933లో పంజాబ్(ఇండియా)లోని లూథియానాలో సజ్జాద్ జన్మించారు. ఆయన 60 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు.
ఆయన అంత్యక్రియలను రావల్పిండిలోని కమిటీ చౌక్‌లో నిర్వహించారు కుటుంబసభ్యులు. 1000కి పైగా టీవీ సీరియల్ డ్రామాలు, 100కి పైగా సినిమాలలో నటించి నటుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు సజ్జాద్. కెరీర్ పరంగా ఎన్నో టీవీ, సినీ అవార్డులు అందుకున్న సజ్జాద్.. పాకిస్తాన్ రేడియోలో అందించిన సేవలకుగాను జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ఆయన కెరీర్ లో రైజ్‌గారి, అఖ్రీ షాబ్, వారిస్ లాంటి నాటకాలు.. జిందగీ, మెహర్బానీ, ఖుదా కే లీ లాంటి సినిమాలు.. మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన కవిగా కూడా అభిమానులకు సుపరిచితమే. అటువంటి గొప్ప నటుడు సజ్జాద్ కిశ్వర్ ఇప్పుడు లేకపోవడం ఆ దేశ సినీ మరియు సీరియల్ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. 1967లో సజ్జాద్ ‘రైజ్‌గారి’ నాటకం ద్వారా నటన రంగంలో అడుగుపెట్టారు. ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం నుండి తమ్ఘా-ఇ-ఇమ్తియాజ్ కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. సజ్జాద్ మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.