సినీ ఇండస్ట్రీ విషాదం చోటుచేసుకుంది. తిరువల్లకు చెందిన ప్రముఖ సినీనటుడు, నాటకరంగ కళాకారుడు డి. ఫిలిప్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. వయసు మీదపడటంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఫిలిప్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కెరీర్ ప్రారంభదశలో కాళిదాస కళాకేంద్రం మరియు కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్(KPAC)లో థియేటర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక రంగస్థల విద్యార్థిగా సినీనటుడు పిజె ఆంటోని వద్ద తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఫిలిప్.. 50కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. అలాగే 1986లో ఆయన నటించిన ‘రెయిన్‌బో’ అనే రంగస్థల నాటకానికి రాష్ట్ర అవార్డును కూడా పొందారు.
సినీ కెరీర్ పరంగా డి. ఫిలిప్ ఎన్నో సూపర్ హిట్ మలయాళ సినిమాలలో నటించారు. అదేవిధంగా చాలా సినిమాలలో కీలక పాత్రలు పోషించి.. మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా మలయాళీ మెగాస్టర్ మమ్ముట్టి నటించిన ‘కొట్టాయం కుంజచ్చన్’, ‘వెట్టం’, ‘ఒన్నమన్’, ‘పఝస్సి రాజా’, ‘సమయం’, ‘ఎజుపున్నతరకన్’ సినిమాలు.. మోహన్‌లాల్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒన్నమన్’ వంటి సినిమాలు.. ఫిలిప్ కెరీర్ లో చెప్పుకోదగ్గవిగా నిలిచాయి.
ఇక నటుడిగా సినిమాల్లో నటించడమే కాకుండా, 1986లో ప్రముఖ నిర్మాత కెజి. జార్జ్ తెరకెక్కించిన క్లాసిక్ హిట్ మూవీ ‘కోలంగల్’కి సహనిర్మాతగా వ్యవహరించారు ఫిలిప్. ఇదిలా ఉండగా.. టీవీ సీరియల్స్ పరంగా ‘స్త్రీ’, ‘స్వామి అయ్యప్పన్’ మరియు మిస్టరీ ఫిక్షన్ సిరీస్ ‘కడమత్తతు కథనార్’ లాంటి చాలా సీరియల్స్‌లో నటించి మలయాళీ బుల్లితెర ప్రేక్షకులను దగ్గరయ్యారు. డి. ఫిలిప్ మృతి.. అటు మలయాళీ బుల్లితెరకు, ఇటు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. ప్రస్తుతం డి. ఫిలిప్ మృతిపట్ల మలయాళీ నటులు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.