గురువు రాకేష్ మాస్టర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్తూ ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘మాస్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటీవల రాకేష్ మాస్టర్ వంటి ఓ మంచి డ్యాన్స్ మాస్టర్‌ని కోల్పోయింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమతో పాటు రాకేష్ మాస్టర్ శిష్యులు, ఆయనతో పరిచయమున్నవారు షాక్‌కి గురయ్యారు. ఆయన శిష్యులు అయిన శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్ పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన ప్రియ శిష్యులు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ పాల్గొని.. ఎమోషనల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ పెద్దకర్మలో భాగంగా ఆయన భార్య, కొడుకు, కూతురు పాల్గొన్నారు. ఈ సంతాప సభలో సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి హాజరయ్యారు. గతంలో రామ్, ఇలియానా జంటగా నటించిన ‘దేవదాసు’ మూవీలో రాకేష్ మాస్టర్ నాలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేశారు.
ఇక రాకేష్ మాస్టర్ కోసం ఆయన శిష్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ పేరిట ప్రతి సంవత్సరం జాతీయ పురస్కారాన్ని నెలకొల్పనున్నారు. ఎంతోమంది ఔత్సాహికులకు డ్యాన్స్ నేర్పించి ప్రయోజకులను చేసిన రాకేష్ మాస్టర్ ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఈ జాతీయ పురస్కారాన్ని ప్రతి ఏటా అందించడానికి సిద్దమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ బుధవారం హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా శేఖర్ మాస్టర్ తన గురువు గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఢీ షోలో ఆయన జడ్జిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
రాకేష్ మాస్టర్ మరణించిన తర్వాత ఈ ఎపిసోడ్‌లో ఆయనకు ఘన నివాళి అర్పించారు. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాకేష్ మాస్టర్ పాత వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ ఆయన గురించి చెప్తూ కాళ్లు మొక్కిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు. యాంకర్ ప్రదీప్ ‘ఈ షో ఎంతో మంది గురువుల్ని పరిచయం చేసింది.. ఎంతో మంది శిష్యుల్ని ఆ గురువుకి పరిచయం చేసింది. గురువు గారైన రాకేష్ మాస్టర్‌ని అందరం కోల్పోయాం’ అనగానే.. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మాస్టర్ గారితో 7, 8 సంవత్సరాల జర్నీ. చాలామంది తెలిసీ తెలియక మాట్లాడుతుంటే చాలా బాధవుతుంది. పైనుంచి మమ్మల్ని బ్లెస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురవుతూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రోమో చూసిన వారు ‘రిప్ రాకేష్ మాస్టర్.. ఇండస్ట్రీ ఓ మంచి మాస్టర్‌ని కోల్పోయింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.