బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్ యాక్ట్ 1985 (ఎన్‌డీపీఎస్) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్‌సీబీ నమోదు చేసింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు.
ఆర్యన్, మరో ఏడుగురి అరెస్టు మెమో ప్రకారం 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు ఎన్‌సీబీ సీజ్ చేసింది. అరెస్టయిన వారిపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 20 (బీ), 27 రెడ్ విత్ సెక్షన్ 35లు నమోదు చేసింది. ఇక ఇలాంటి కేసుల్లో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. ఇక వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాణిజ్యపరంగా డ్రగ్స్ కలిగి ఉంటే ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేకుండా బెయిలు రావడం కుదరదు.
ఇక ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నేపథ్యంలో అసలు రేవ్ పార్టీ ఎవరు జరిపించారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తాను నాలుగు సంవత్సరాల నుంచి డ్రగ్స్ వాడుతున్నట్లుగా ఆర్యన్ తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉండొచ్చు అని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.