తమిళ డ్యాన్సర్, నటుడు రమేశ్ గత నెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉంటున్న భవనంలోని 10వ అంతస్థు నుండి దూకి ప్రాణాలు వదిలారు. అయితే అతడిదీ హత్య అని రమేష్ మొదటి భార్య చిత్ర ఆరోపించారు. రెండో భార్య చిత్ర హింసల కారణంగానే అతడు చనిపోయాడని చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రమేశ్ అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో అతడిని కొట్టడం కనిపిస్తోంది.
ఓ పొడవాటి కట్టెను పట్టుకుని కొడుతుంటే ఆయన తట్టుకోలేక టేబుల్ ఫ్యాన్ ను అడ్డు పెట్టుకుని కొట్టొద్దని వేడుకుంటున్నారు. అయితే ఇది మూడు సంవత్సరాల క్రితం తీసిన వీడియోగా ఆమె చెబుతున్నారు. ఈ వీడియో చూసి తన భర్త పట్ల తానెంతో ఆవేదన చెందానని అన్నారు. అంతే కాకుండా చచ్చిపో అంటూ రెండో భార్య, కూతురు శాపనార్థాలు పెడుతుండటం వంటి దృశ్యాలు ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నాయి. ‘నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నానంటూ’ రమేశ్ బాధతో ఆవేదన చెందుతుంటే.. ఉరితాడు తీసుకురమ్మంటావా అంటూ అడగటం కనిపిస్తోంది.
వీడియో చివరిలో రెండో భార్య సోఫాలో పెద్ద కట్టెతో కూర్చుని కనిపించడం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, రమేశ్ టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అయ్యారు. దీంతో అతడికి డ్యాన్స్ జోడి డ్యాన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోతో గుర్తింపు రావడంతో అతడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇటీవల అజిత్ నటించిన తునివు అనే సినిమాలో నటించిన ఆయన.. రజనీకాంత్ జైలర్ లోనూ కనిపించారని సమాచారం.