నటీనటులు: కిరణ్ అబ్బవరం, నమ్రత దారేకర్(నువేక్ష), కోమలి ప్రసాద్
బ్యానర్: జ్యోవిత సినిమాస్
నిర్మాతలు: బి. సిద్ధారెడ్డి, బి. జయచంద్రరెడ్డి
సినిమాటోగ్రఫీ: రాజు కే నల్లి
సంగీతం: జిబ్రాన్
రచన – దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నుండి వచ్చిన సినిమా ఇది. పాటలతో, ట్రైలర్ తో ఆసక్తిరేపిన ఈ సెబాస్టియన్ మూవీ.. మినిమమ్ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటగా రేచీకటి – కానిస్టేబుల్ – నైట్ డ్యూటీస్ అనే పాయింట్స్ తో ఇంటరెస్ట్ కలిగించిన సెబాస్టియన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
సెబాస్టియన్(కిరణ్ అబ్బవరం) మదనపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. చిన్నప్పటి నుండే రేచీకటితో బాధపడుతుంటాడు. తల్లి మేరీ(రోహిణి) దగ్గరుండి చనిపోయిన తండ్రి కోరిక మేరకు సెబాస్టియన్ పోలీస్ కావాలని చెప్పి.. ఇల్లు తాకట్టు పెట్టి కొడుక్కి కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చిపెడుతుంది. తనకున్న లోపం వలన సెబాస్టియన్ ఓ మహిళ మృతికి కారణం అవుతాడు. మరి రేచీకటి ఉన్న సెబాస్టియన్ నైట్ డ్యూటీస్ ఎలా చేశాడు? అతని లైఫ్ లోకి హీరోయిన్ ఎలా ఎంటర్ అవుతుంది? తండ్రి కోరిక మేరకు సెబాస్టియన్ ఉద్యోగం ఎలా కాపాడుకున్నాడు? చనిపోయిన మహిళకు ఎలా న్యాయం చేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సెబాస్టియన్ ప్రారంభంలో హీరో కిరణ్ అబ్బవరం ఎంట్రీ, క్యారెక్టరైజేషన్ వరకు బాగానే ప్లాన్ చేసినప్పటికీ.. అన్నీ ఉన్నా అసలుకి ఎసరు పడిందన్నట్లుగా సాగింది ఈ సినిమా తంతు. సినిమా అంతా సెబాస్టియన్ పై, అతని లోపం రేచీకటి పైనే ఫోకస్ పెట్టారు. డెబ్యూ డైరెక్టర్ బాలాజీ సయ్యపురెడ్డి సినిమా అంతా రేచీకటితో కానిస్టేబుల్ సెబాస్టియన్ ఎదుర్కొనే ప్రాబ్లెమ్స్, నైట్ డ్యూటీస్ పడినప్పుడు అతను పడే ఇబ్బందులపై పెట్టిన దృష్టి.. స్క్రిప్ట్ ని మరింత బిగువుగా, బలంగా రాసుకోలేకపోయాడు. సినిమాలో ఇంటరెస్ట్ ఎలిమెంట్స్ సరిగ్గా లేకపోవడం, సినిమా అంతా సీరియస్ గా సాగిపోవడం, కామెడీ లోపించి.. ఓ విధంగా ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టిందనే చెప్పాలి.
సినిమాలో హీరోయిన్ హెలి, హీరో ఫ్రెండ్ తేజ, డాక్టర్, చనిపోయిన మహిళ నీలిమ పాత్రలు కథలో కీలకం అయినప్పటికీ.. వాటికి సరైన కథనం, ముగింపు లభించలేదు. రేచీకటి కారణంగా ఎక్కువ ట్రాన్స్ఫర్ అయిన సెబాస్టియన్.. ఒకానొక దశలో మహిళ మృతికి కారణమై సస్పెండ్ అవుతాడు. అదే సమయంలో చనిపోయిన సెబాస్టియన్ తల్లి అంతరాత్మగా వచ్చి.. ఉద్యోగం పోతే పోయింది.. ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్తుంది.. ఇక్కడే ప్రేక్షకుల మైండ్ దారితప్పేలా చేశారు మేకర్స్. మొదట్లో ఉద్యోగం పోకుండా మేనేజ్ చేయమని చెప్పిన తల్లి.. తీరా సస్పెండ్ అయ్యేసరికి న్యాయం కోసం పోరాటం చేయమని చెప్పడం ప్రేక్షకులను కన్ఫ్యూస్ చేస్తుంది.
అప్పటినుండి హీరో అ మహిళకు న్యాయం చేయాలని కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. అదే కేసులో ఫ్రెండ్, లవర్ నిందితులుగా ఉన్నప్పటికి మళ్ళీ మళ్లీ కలుసుకొని ఏమి తెలియనట్లు మాట్లాడి.. చివరిగా ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేయడంలో కూడా స్క్రీన్ ప్లే వీక్ అయిందని గుర్తుచేస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి నెక్స్ట్ సీన్ ఏంటో.. ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టగలరు. చివరిగా హీరో మూసేసిన మహిళ కేసులో ఎలాంటి మలుపు తీసుకొచ్చాడు.. అనేది కూడా కన్విన్సింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. కిరణ్ అబ్బవరం రేచీకటి కలిగిన సెబాస్టియన్ కానిస్టేబుల్ గా ఆకట్టుకున్నాడు. కానీ కొన్నిచోట్ల రేచీకటి అనేది స్టోరీ కంటే ఎక్కువ అయిపోయిందనే ఫీలింగ్ కలిగిస్తుంది. కిరణ్ పరవలేదనిపించాడు.
హీరోయిన్ నమ్రత.. హెలి పాత్రలో ఆకట్టుకోలేకపోయింది. మదనపల్లి ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగార్ యాక్టింగ్ బాగుంది. కానిస్టేబుల్ నిరంజన్ గా కమెడియన్ రవితేజ యాక్టింగ్ పరవాలేదు. ఇక నీలిమగా కోమలి, తేజగా జార్జ్, డాక్టర్ గా సూర్యల పెర్ఫార్మన్స్ అంతంత మాత్రంగానే ఉంది. సినిమా స్క్రిప్ట్ ప్రేక్షకులను ఇంటరెస్టింగ్ కూర్చోబెట్టడంలో మిస్ ఫైర్ అయింది.. నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. సినిమాటోగ్రఫీ రాజు కే నల్లి పరవాలేదనిపించారు. ఎడిటర్ విప్లవ్.. సినిమాలో ఇంకొన్ని కట్స్ వేసుంటే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్.. సినిమాలో కంటెంట్ లోపించినా తన బిజీఎం తో లేపే ప్రయత్నం చేసాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా జిబ్రాన్ న్యాయం చేసాడు. మరి తను రాసుకున్న కథను సరిగ్గా తీయలేకపోయాడో.. లేదా స్క్రిప్ట్ లో లోపాలు ఏర్పడ్డాయో తెలియదు. కానీ సెబాస్టియన్ ని ఫుల్ ఫ్లెడ్జిగా చూపించడంలో దర్శకుడు బాలాజీ నిరాశపరిచాడు.
ప్లస్ లు:
కిరణ్ అబ్బరవం యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ లు:
స్లో స్క్రీన్ ప్లే
లాగ్ సీన్స్
డైరెక్షన్
సినిమా డ్యూరేషన్
ఎడిటింగ్
చివరిమాట:
గురితప్పిన కానిస్టేబుల్ కథ!
రేటింగ్:
2/5