తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది ఓ ప్రభంజనం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తిని నమ్ముకుని.. అహోరాత్రాలు శ్రమించి.. టాలీవుడ్‌లో మెగాస్టార్ అనే స్థాయికి చేరుకున్నారు. ఓ రంగంలో రాణించాలని బలంగా కోరుకుంటే.. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే సాధించగలం అని నిరూపించారు చిరంజీవి. సినీ ప్రపంచలో రాణించాలనుకునే సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నాలుగు దశాబ్దాలకు పైనే గడుస్తున్నా.. నేటికి కూడా ఆయనుకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినీ రంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను.. పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి.
ఈ నేపథ్యంలో తాజాగా సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ.. కేంద్రం ఆయనకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. చిరంజీవిని అభినందిస్తూ లేఖ రాశారు. జాతీయ స్థాయిలో తెలుగు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల అభినందనలు తెలిపారు.
తెలుగు సినీ రంగం గర్వించదగిన శిఖర సమాన కళాకారుల్లో చిరంజీవి ఒకరని ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రశంసించారు. సినీ రంగంలో చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అభినందించారు. చిరంజీవికి అత్యున్న పురస్కారం లభించటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని జస్టిస్ రమణ పేర్కొన్నారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలు మహోన్నతం. ఇక చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రశంసించారు.
ఇక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గతంలో వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్‌ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషిలు అందుకున్నారు. తాజాగా ఈ ఏడాది.. ఆ పురస్కారం చిరంజీవికి అందించారు. ఇక ఈ పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షల నగదు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం పట్ల మెగా ఫ్యాన్స్ అభినందలు తెలుపుతున్నారు.