గత 19 ఏళ్లుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని కళాకారులకు అవార్డులు అందిస్తున్న.. సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఎంతటి ప్రత్యేకతని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇక.. ఇప్పుడు డిజిటిల్ మీడియా జైన్ట్ సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి సంతోషంతో కలసి ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగం అయ్యింది. హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ ఆదివారం సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్‌కు సీనియర్ నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన సంతోషం-సుమన్ టీవీ అవార్డ్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నంది అవార్డులను ప్రకటించాలిని కోరారు. నటీనటులకు అవార్డులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, కళాకారులుగా ప్రభుత్వాల నుంచి కోరుకునేది ప్రోత్సాహం మాత్రమేనని ఆయన అన్నారు. నంది అవార్డులు ప్రదానం చేసేందుకు ఏమంత ఖర్చు అవుతుందని ఆయన ప్రశ్నించారు. కచ్చితంగా ప్రభుత్వాలు నంది అవార్డు ప్రకటించాలని ఆయన గట్టిగానే కోరారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వాధినేతలను కలిసి కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.