సంధ్యా జనక్.. అని పేరు చెబితే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ఆమెను చూస్తే మటుకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అరే ఈమెను చాలా సినిమాల్లో చూశామే అని అనుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సంధ్యా జనక్ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న చిన్న హీరోల దగ్గరినుంచి స్టార్ హీరోలకు సైతం ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోయిన్స్ తల్లి పాత్రల్లో కూడా మెరుస్తున్నారు. నిజానికి ఆమె చేసిన పాత్రలో నూటికి 90 శాతం ఇవే ఉంటాయి. ప్రస్తుతం సంధ్యా జనక్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ఆ వీడియోలో ప్రముఖ బహు భాషా నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి పని చేసిన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ప్రకాశ్ రాజ్ కొద్దిగా షార్ట్ టెంపర్ అని ఆమె పేర్కొన్నారు. సంధ్యా జనక్ మాట్లాడుతూ.. ‘‘ ప్రకాశ్ రాజ్ గారి కాంబినేషన్‌లో యాక్టింగ్ అంటే నాకు చాలా భయమేసేది. ఆయన ఒక లెజెండ్‌లాగా.. అంతేకాదు! ఆయన ఒక షార్ట్ టెంపర్. అది ఆయన ఎక్స్‌పీరియన్స్ వల్ల కావచ్చు.. కచ్చితంగా అది ఉంటుంది. అందుకే, నేను భయపడేదాన్ని. డైలాగ్ సరిగా చెప్పకపోతే ఆయనకు కోపం వచ్చేస్తే కష్టం అని.
కానీ, అలా ఏం జరగలేదు. ఒకసారి నాతో ఇరిటేట్ అయ్యారనుకుంటా.. ఆయన డైలాగ్ చెప్పే కంటే ముందే నేను ఏదో చేప్పేశా. అది నా డైలాగ్.. నేనెక్కడ మర్చిపోతానేమోనని ముందుగానే చెప్పేశా. దీంతో ఆయన ఒక్కసారి నా వైపు అలా చూసి.. ఏదో గొణిగారు. సారీ సార్ తప్పయిపోయింది అని చెప్పా. ఆయన పర్వాలేదు అన్నారు’’ అని ప్రకాశ్ రాజ్ గురించి చెప్పుకొచ్చారు. కాగా, సంధ్యా జనక్ అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, గీతా గోవిందం లాంటి సినిమాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు.