2005 లో ఎన్టీఆర్ నటించిన ‘నర్సింహుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నటి సమీరా రెడ్డి. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ చిత్రంలో తన అందచందాలతో మురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రంలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో నటించింది.
పెళ్లయిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. కానీ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఇప్పటికీ టచ్ లోనే ఉంటున్నారు. తన వర్కౌట్లు, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా న తెల్ల జుట్టు గురించి ఆమె తండ్రితో సంభాషించిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆమె తెల్ల జుట్టుతో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేయగా అది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. ‘తెల్ల వెంట్రుకలను ఎందుకు కవర్ చేసుకోవట్లేదని అందరూ అడుగుతుంటే ఏదోలా అనిపిస్తోంది’ అని ఆమె తండ్రి అడిగాడని సమీరా చెప్పుకొచ్చారు.
దానికి సమాధానంగా సమీరారెడ్డి ‘నా లుక్ గురించి ఎవరు బాధపడనక్కర్లేదు. నేను ప్రతి రెండు వారాలకొకసారి జుట్టుకు కలర్ వేసుకునేదాన్ని. అప్పుడు ఎవరూ ఆ తెల్లటి గీతను గమనించలేదు. ఇప్పుడు కలర్ వేసుకునేందుకు సమయాన్ని వెచ్చించట్లేదు. నాకు నచ్చినప్పుడు, ఇష్టం వచ్చినపుడు వేసుకుంటాను. దీనిపై చర్చిస్తున్న వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పాత ఆలోచనలు విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే మనలో మార్పు మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది మనలో సహజంగానే ఉంటే ఏ ముసుగు దాన్ని కప్పి ఉంచలేదు. అది మా నాన్నకు అర్థమైంది. అలాగే ఒక తండ్రిగా నాన్న ఆందోళనను నేనూ అర్థం చేసుకున్నాను. ప్రతిరోజు మనం కొత్త విషయాలు నేర్చుకుంటేనే ముందుకు వెళ్లగలం.. చిన్న మార్పులతోనే మానసిక ప్రశాంతత పొందగలం. ఆ చిన్న మార్పులే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి’అని సమీరారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.