స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల ఒక వీరాభిమాని గుడి కట్టిన సంగతి విదితమే. నటనతో పాటు ఆమె చేసే సేవా కార్యక్రమాలు నచ్చి సామ్‌కు ఆలయం కట్టానని ఆ ఫ్యాన్ అంటున్నారు. దీనిపై ఆ అభిమాని భార్య కూడా స్పందించారు.
సినీ తారలు అంటే ప్రేక్షకులకు ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. వారు ఏం చేస్తున్నా, తాము కూడా అది చేయాలనుకుంటారు. అభిమాన తారల సినిమాలు విడుదలైనప్పుడు టపాసులు పేలుస్తూ, పాలభిషేకాలు చేస్తూ థియేటర్లలో పండుగ వాతావరణం ఏర్పడేలా చేస్తారు. కొందరు ఫ్యాన్స్ తమకు ఇష్టమైన నటులకు ఏకంగా ఆలయాలు కూడా కట్టించేస్తున్నారు. తమిళనాడులో హీరోయిన్లు ఖుష్బూ సుందర్, హన్సికా మోత్వానీ, నయనతారలకు వారి ఫ్యాన్స్ గుళ్లు కట్టడం గురించి వార్తల్లో వినే ఉంటారు. ఈ క్రమంలో మరో హీరోయిన్‌కు ఇటీవలే గుడి కట్టారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఒక అభిమాని గుడి కట్టారు. తన అభిమాన నటి విగ్రహాన్ని చేయించి ఆలయాన్ని నిర్మించిన ఆ ఫ్యాన్.. ఆమె పేరిట కొందరికి భోజనాలు కూడా పెట్టారు. ఎన్జీవోలు పెట్టి చాలా మందికి సాయం చేయడంతో పాటు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంత అంటే అభిమానంతోనే తాను గుడి కట్టినట్లు ఆమె అభిమాని, ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ చెప్పారు. సమంతకు సందీప్ గుడి కట్టడంపై ఆయన భార్య స్పందించారు. తాను ఎంతగానో ఆరాధించే, ఇష్టపడే నటికి సందీప్ ఆలయం నిర్మించడంపై ఆయన భార్య హర్షం వ్యక్తం చేశారు. చాన్నాళ్లుగా గుడి కట్టాలని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు కుదిరిందన్నారు. రోజూ ఒక్కసారైనా సమంత టాపిక్ తమ ఇంట్లో వస్తుందని.. పెళ్లైన కొత్తలోనే ఆమెకు తాను అభిమానినని సందీప్ చెప్పారని ఆమె పేర్కొన్నారు.