స్టార్ హీరోయిన్ సమంతతో నటించాలని హీరోలందరూ అనుకుంటారు. కానీ ఆమె ఎక్కువగా పెద్ద హీరోల చిత్రాల్లోనే నటిస్తున్నారు. అలాగే ఫిమేల్ ఓరియంటెడ్ కథల్లో యాక్ట్ చేస్తున్నారు. కానీ కుర్ర హీరోలతో మూవీస్ పెద్దగా చేయడం లేదు. అయితే సామ్ తన తర్వాతి ప్రాజెక్టులో ఒక యంగ్ హీరోతో జోడీ కట్టనున్నారట.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చేసే సినిమాల కోసం ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందంతో పాటు అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది మనసుల్లో ఆమె స్థానం సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు సామ్. ఇటీవల ‘శాకుంతలం’తో ఆడియెన్స్ ముందుకు వచ్చారామె. అయితే ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ హిందీ రీమేక్‌తో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమా షూటింగ్స్‌తో సమంత ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె నటించే ప్రాజెక్టుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే టాలీవుడ్లో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. సామ్ తదుపరి మూవీలో హీరోగా ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్‌కు అంతా సెట్ అయ్యిందట.
సమంత-సిద్ధూ జొన్నలగడ్డ కాంబోలో మూవీకి సీనియర్ డైరెక్టర్ నందినీ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆమె దర్శకత్వం వహించిన ‘అన్నీ మంచి శకునములే’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఫిల్మ్ తర్వాత సామ్-సిద్ధూతో చేసే ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ఆమె భావిస్తున్నారట. దీనికి క్రేజీ కథ కూడా రెడీ అయ్యిందట. ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారట. నందినీ రెడ్డి డైరెక్షన్లో గతంలో ‘ఓ బేబీ’, ‘జబర్దస్త్’ చిత్రాల్లో నటించారు సమంత. వీళ్లిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒకవేళ కొత్త మూవీ సెట్ అయితే.. వీళ్ల కాంబోలో వచ్చే మూడో సినిమా అవుతుంది. సమంత, సిద్ధు జొన్నలగడ్డతో నందినీ రెడ్డి మూవీ ఓకే అయినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. సమంత, సిద్ధు లేదా నందినీ రెడ్డిల్లో ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇస్తే గానీ.. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందో లేదో చెప్పలేం. మరి.. సామ్-సిద్ధు జొన్నలగడ్డ కలసి మూవీ చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.