ప్రముఖ హీరోయిన్ సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకుంటోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వార్తలపై సమంత స్పందించారు. తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. శనివారం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ యశోధ ట్రైలర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్‌కు చాలా సంతోషంగా ఉంది. నేను మీతో పంచుకున్న ప్రేమానుబంధం అది.
దాని వల్లే నేను ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలదొక్కుకోగలిగాను. కొన్ని రోజుల క్రితం నాకు ఓ ఆటో ఇమ్యూన్ కండీషన్ ఉన్నట్లు తేలింది. దాని పేరు మ్యోసిటిస్(Myositis). నేను ఇది తగ్గిన తర్వాత ఈ విషయం గురించి మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ, ఇది తగ్గటానికి చాలా టైం తీసుకునేలా ఉంది. ప్రతీ విషయంలో మనం ధృడంగా అడుగు ముందుకు వేయలేమని నాకు నిదానంగా అర్థం అవుతోంది. కొన్ని మనం అంగీకరించి తీరాలి. నేను త్వరలో దీని నుంచి కోలుకుంటానని భావిస్తున్నారు.
నేను ఎన్నో మంచి రోజులు, చెడ్డ రోజులు చూశాను. అది కూడా మానసికంగా శారీరకంగా. నేను వాటిని అసలు భరించలేను అనుకున్నా.. కానీ, వాటినుంచి తొందరగానే బయటపడ్డా. అంటే.. నేను త్వరలో దీన్నుంచి కూడా కోలుకుంటానని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు. చేతికి సెలైన్ పెట్టుకుని దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. సమంత అనారోగ్యం వార్త తెలిసి అభిమానులు బాధలో మునిగిపోయారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. కాగా, సమంత నటించిన యశోధ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.