చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా పాపులర్ నటీనటులంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో నటుడి మరణవార్త అటు ఇండస్ట్రీని, ఇటు అభిమానులను కలవరపెడుతోంది. ప్రముఖ నటుడు కేలు.. బుధవారం(నవంబర్ 2న) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. కాగా, పదేళ్ల క్రితం మలయాళంలో తెరకెక్కిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ మూవీ ద్వారా కేలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కేలు.. ‘మూప్పన్’ అనే పాత్రలో నటించారు.
ఇక బుధవారం సాయంత్రం కేలు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్య పుష్ప.. పిల్లలు రాజన్, మణి, రామ ఉన్నారు. అయితే.. కొంతకాలం నుండి కేలు వయసు మీదపడటంతో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేలు.. చెన్నిలారా కురిచియా కుటుంబంలో జన్మించాడని.. కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలో నివసించే కురిచ్యార్ కమ్యూనిటీకి చెందిన గిరిజన నాయకుడని సమాచారం. ఆయన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ మూవీలో మూప్పన్ పాత్రతో నటుడిగా వెలుగులోకి వచ్చారు.
ఇదిలా ఉండగా.. కేలు ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ మూవీ మాత్రమే కాకుండా, ‘పజ్సిరాజా’, ‘ఉండా’ వంటి అనేక మలయాళ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. కేలు 2021లో విడుదలైన ‘బ్లాక్ కాఫీ’ సినిమాలో చివరిసారి నటించారు. ఈ సినిమా 2011లో వచ్చిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇక నటుడు కేలు మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా కేలు మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
Salt and Pepper fame ‘mooppan’ Kelu passes away https://t.co/PtUkfqzixY #Kerala
— Mathrubhumi English (@mathrubhumieng) November 2, 2022