జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అనే డైలాగ్‌తో యువకులని మంత్ర ముగ్ధులని చేశారు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలోని ‘రాను రానంటూనే సిన్నదో’ పాట ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ఈ పాటలో నితిన్, సదా చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పాట .. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న సదా.. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు. ప్రాణం, నాగ, దొంగ దొంగది, అపరిచితుడు వంటి సినిమాల్లో నటించారు. రెండు, మూడు సినిమాలు తప్పితే సదా కెరీర్‌లో చెప్పుకోతగ్గ హిట్స్ పడలేదు. హిట్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన సదా.. బుల్లితెర మీద డ్యాన్స్ షోలకి జడ్జిగా కూడా చేశారు.
అయితే అవకాశాలు లేక కొన్నాళ్ళు ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత ఆమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఇటీవల జబర్దస్త్ షోలో కొన్ని ఎపిసోడ్స్‌కి జడ్జిగా కూడా చేశారు. రీసెంట్‌గా ఈమె నటించిన ‘హలో వరల్డ్‘ వెబ్ సిరీస్ రిలీజైంది. ఈ సిరీస్ మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆమె మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి ప్రస్తావించారు. తనకు పెళ్ళి ఆలోచన లేదని ఆమె వెల్లడించారు. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే తనను పెళ్ళి చేసుకునేవాడు ఆమె సంపాదనపై ఆధారపడకూడదని ఆమె అన్నారు. తన డబ్బు గురించి ఆశించే మగాడు భర్తగా రావాలనుకోవడం లేదని ఆమె అన్నారు. తన సంపాదన ఆశించకుండా పెళ్ళి చేసుకునే వ్యక్తి ఒక్కరూ తనకు ఇప్పటివరకూ కనబడలేదని, అందుకే ఇంకా పెళ్ళి చేసుకోలేదని ఆమె వెల్లడించారు. ఇంకా ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. మరి సదా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి సదా మాట్లాడిన ఫుల్ వీడియోను వీక్షించండి.