సినిమా రంగుల ప్రపంచంలో మనకు కనిపించేవన్నీ వాస్తవాలు కాదు. హీరోలుగా, హీరోయిన్లుగా స్టార్ డమ్‌లను అనుభవిస్తున్న వారి జీవితాల్లోనూ కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ, పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు మనల్ని భ్రమింపజేస్తూ ఉంటారు. ఏం జరిగినా తమ పని తాము చేసుకుని పోతూ ఉంటారు. అవకాశం వచ్చినపుడు తమ మనసులోని బాధను దించుకుంటూ ఉంటారు. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రముఖ నటి ప్రగతి జీవితం. సినిమాల్లో హీరోయిన్‌గా తెరపైకి వచ్చిన ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే హీరోయిన్ కెరీర్‌ను కోల్పోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీ,బిజీగా గడిపేస్తున్నారు. ప్రగతి తన శరీరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తూ ఉంటారు. మగాళ్లతో సమానంగా జిమ్‌లో బరువులు ఎత్తుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక, షోలలో కూడా అందరి నవ్విస్తూ, నవ్వుతూ ఎంతో చలాకీగా ఉంటారామె. ఇలా స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి నవ్వుతూ ఉండే ఆమె జీవితంలోనూ చీకటి కోణం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ పైకి ఎదిగారు.
ఈ సమయంలోనే మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాకు చెప్పుకున్నారు. గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో మంచి పాత్రలలో నటించా. కానీ, నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత నాకు తగ్గట్టు మంచి పాత్రలు రాకపోవడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. ఒత్తిడి కారణంగానే కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. నేను కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలబడటం.. అందమైన యంగ్ అమ్మ పాత్ర వరకు అన్నీ చేశా. చాలా వరుకు సెట్ ప్రాపర్టీలా పని చేశా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.